సంక్షేమ పథకాలలో తెలంగాణ ఆదర్శం -వేములవాడ ఎమ్మెల్యే రమేష్
వేములవాడ రూరల్, ఆగస్టు 10 (జనంసాక్షి) : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం చెక్కపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఆయన అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ పథకాలైన రైతు బంధు, రైతు బీమా, దళిత, బీసీ, మైనార్టీ బంధు, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, కెసిఆర్ కిట్, కంటి వెలుగు, మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, కుల సంఘాల భవనాలు, మత్స్యకారులకు చేపల పంపిణీ, గీత కార్మికులకు ఆర్థిక సాయం వంటి పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికి తెలిసేలా పార్టీ యంత్రాంగం కృషి చేయాలన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చిన కార్యక్రమాలు కలిసికట్టుగా, సమిష్టిగా విజయవంతం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతి వంద మందికి ఒక బూత్ కమిటీని వేసుకుందామని దానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు. రానున్న వంద రోజులు మనకు కీలకమని, ఇప్పుడే పార్టీ యంత్రాంగం కీలకంగా వుండాలని తెలిపారు. ప్రతి గ్రామంలో పార్టీ సమావేశాలు జరగాలని సూచించారు. కేసీఆర్ మూడవ సారి సీ.ఎం కావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జెడ్.పి.టి.సి యేష వాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మాజీ మార్కెట్ చైర్మన్ గడ్డం హనుమాండ్లు, పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, సర్పంచులు, ఎం.పి.టి.సీలు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.