సంక్షోభంలో జార్ఖండ్‌ సర్కార్‌

అర్జున్‌ముండాకు పదవీ గండం
మద్దతు ఉపసంహరించుకున్న జేఎంఎం

రాంచి, జనవరి 7 (జనంసాక్షి):

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.  ప్రభుత్వం ప్రమాద అంచుల్లో ఉంది. అర్జున్‌ముండాకు పదవీ గండం ముంచుకొస్తోంది. రాష్ట్ర  బిజెపి సర్కార్‌కు జార్ఖండ్‌ ముక్తి మోర్జా(జెఎంఎం) మద్దతు ఉపసం హరించుకోవడంతో అర్జున్‌ ప్రభుత్వం మైనారీటీలో పడిపోయింది. బిజెపి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీఎం అర్జున్‌ ముండాను పదవి నుంచి తొలగించాలని, ఆయన స్థానంలోకొత్త వారిని నియమించాలని మిత్రపక్షం జెఎంఎం డిమాండ్‌చేస్తోంది. అయితే బిజెపి మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. అయితే ముండాను తొలగిస్తేనే బిజెపి సర్కార్‌కు తమ మద్దతు కొనసాగిస్తామని, లేకపోతే మద్దతు ఉపసహరిస్తామన జెఎంఎం అధినేత శిబూషోరెన్‌ స్పష్టం చేశారు. దీంతో మిత్రపక్ష జెఎంఎం అధినేత శిబూషోరెన్‌ను సీఎం అర్జున్‌ ముండా బుజ్జగించే పనిలో పడ్డారు. సోమవారం ఆయన శిబూను కలుసుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, ఇప్పటికే శిబూషోరెన్‌ కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఫలించి కాంగ్రెస్‌ జెఎంఎంకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు జెఎంఎం సిద్ధంగా ఉంది. బిజెపి సర్కార్‌ భవితవ్యం ప్రస్తుతం కాంగ్రెస్‌ నిర్ణయంపై ఆధారపడి ఉండడంతో అర్జున్‌ పదవీ డొలాయమనంలో పడింది.