సంఘమిత్రతో ఓట్లు గల్లంతే
– రాష్ట్రాన్ని సీఎం అధోగతిపాలు చేస్తున్నాడు
– బాబు పేరు చెబితే మోసం, వంచన గుర్తుకొస్తాయి
– వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
– బూత్‌కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి
కడప, ఆగస్టు 11(జనం సాక్షి) : తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘమిత్ర అనే కార్యక్రమంతో ఓట్లు తీసివేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వేంపల్లిలో మండల బూత్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంను శనివారం నిర్వహించారు. ఈ సమావేశాంలో మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర కార్యాలయం సలహా మేరకు మండల స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పితే ప్రతి రైతు ఉపయోగిస్తున్న ఉచిత కరెంట్, ఫీజు రియంబర్స్‌మెంట్, వివిధ సంక్షేమ పథకాలు గుర్తుకువస్తాయన్నారు. చంద్రబాబు పేరు చెప్పితే మోసం, వంచన తప్ప ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదన్నారు. కేవలం పదిశాతం పనులు పూర్తి చేసి అంతా మేమే చేశాం అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రతీ ఒక్క బూత్ కమిటీ సభ్యుడు, కన్వీనర్ తన పోలింగ్ బూత్‌పైనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. పార్టీ కోసం విూరు చేస్తున్న కృషి, శ్రమకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నా కార్యకర్తలనుద్దేశించి అవినాష్ పేర్కొన్నారు. కడపలో లక్షా ఇరవైవేల ఓట్లు గల్లంతు అయ్యాయని, ప్రతీ బూత్ కమిటీ కన్వీనర్ శ్రద్దగా పనిచేయాలని అప్పుడు ఓట్లు గల్లంతు అయ్యే అవకాశం ఉందని పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న తపన ఉన్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి అన్నారు. భావి తరాలకు ఒక దిశ దశను చూపించే నాయకుడు జగన్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ బెల్లం ప్రవీణ్ కుమార్, ఎంపీపీ రవికుమార్ రెడ్డి, జడ్పిటీసీ షబ్బీర్ వలి, కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, జిల్లా బూత్ కమిటీ ఇంచార్జ్ మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.