సంజయ్‌దత్‌ విడుదల

3

పుణె,ఫిబ్రవరి 25(జనంసాక్షి): ప్రముఖ హిందీ నటుడు సంజయ్‌దత్‌ గురువారం ఉదయం పుణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న ఆయన ఇప్పటి వరకు 42 నెలలపాటు కటకటాల్లో ఉన్నారు. జైలులో సంజయ్‌దత్‌ సత్పవ్రర్తనను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల ఆయన శిక్షా కాలాన్ని తగ్గించింది. దీంతో ఆయన ముందుగానే జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో కనీసంగా 8నెలల కాలం తగ్గింది. ఆయన విడుదలతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

నిన్న రాత్రి తినలేదు.. నిద్రపోలేదు!

జైలు నుంచి బయటకు వస్తున్నానన్న ఆనందం.. ఇక మళ్లీ లోపలకు రావల్సిన అవసరం లేదన్న భావనతో చాలా ఉద్వేగంగా అనిపించిందని, అందుకే బుధవారం రాత్రి అంతా తాను తిండి సరిగా తినలేదు.. నిద్ర కూడా పోలేదని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ తెలిపారు. పుణె ఎరవాడ జైలు నుంచి విడుదలై, ముంబైలో సొంత ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన కిక్కిరిసిన విూడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లకు తనకు స్వాతంత్య్రం లభించిందని, కానీ ఇప్పుడు కూడా ఆ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా ఏదో పెరోల్‌ విూద బయటకు వచ్చినట్లే అనిపిస్తోందన్నారు. ఈ సమయంలో తనకు తన తండ్రి బాగా గుర్తుకొస్తున్నారని, ఆయన ఉంటే చాలా సంతోషించేవాళ్లని తెలిపారు. ”నాన్నా.. నేను బయటకు వచ్చేశాను” అని పైకి చూస్తూ చెప్పారు. తాను ఈ దేశ పౌరుడినని, భారతీయుడైనందుకు గర్వపడుతున్నానని సంజయ్‌ దత్‌ చెప్పారు. అలాగే శిక్ష విధించే సమయంలో కూడా.. తాను టెర్రరిస్టును కానని కోర్టు చెప్పిందని, ఆరోజు చాలా సంతోషంగా అనిపించిందని, ఆ విషయం తన తండ్రి సునీల్‌దత్‌కు తెలిస్తే ఇంకా బాగుండేదని అన్నారు. తన చిన్నతనంలోనే అమ్మ కేన్సర్‌తో చనిపోయిందని, ఆమె సమాధి వద్దకు వెళ్లి తాను స్వేచ్ఛాజీవినని చెప్పడం తన విధి అని తెలిపారు. సెలబ్రిటీని కాబట్టి పెరోల్‌ వచ్చిందనో, ముందుగా విడుదల చేశారనో అనుకోవడం తప్పని, తన ప్రవర్తనను బట్టి వాళ్లు నిర్ణయం తీసుకుని ఉంటారని అన్నారు. మాన్యత తన బెటర్‌ హాఫ్‌ కాదు.. బెస్ట్‌ హాఫ్‌ అని వ్యాఖ్యానించారు. ఓ మంచి భర్తగా తాను జైల్లో సంపాదించిన మొత్తం తన భార్యకే ఇచ్చానని తెలిపారు. అనంతరం తన భార్య, కొడుకు, కూతుళ్లతో కలిసి విూడియాకు ఫొటో పోజులు ఇచ్చారు. పిల్లలిద్దరూ తండ్రిని అతుక్కుపోయి కనిపించారు.