సంజయ్‌దత్‌ విడుదలపై పిటీషన్‌

2A

ముంబై,ఫిబ్రవరి 24(జనంసాక్షి): బాలీవుడ్‌ ‘మున్నాభాయ్‌’ సంజయ్‌దత్‌ ఐదేళ్ల జైలుశిక్ష పూర్తి చేసుకొని గురువారం విడుదలకానున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదలను నిలిపివేయాలంటూ బొంబాయి హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. జైలు శిక్షాకాలంలో సెలబ్రిటీ ఖైదీ అయిన సంజూ పట్ల అధికారులు అసంబద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ ప్రదీప్‌ భాలేకర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ గురువారమే కోర్టు ముందు విచారణకు రానుంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా సంజయ్‌దత్‌ విడుదలను కోర్టు రద్దు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలోనూ ఈ విషయంలో హైకోర్టుకు లేఖ రాశారు. కానీ న్యాయస్థానం ఈ లేఖను తోసిపుచ్చింది. 1993 నాటి ముంబై వరుస పేలుళ్లకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో సంజయ్‌ దత్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. జైలు శిక్షాకాలం ముగియడంతో సంజూ గురువారం ఉదయం యెరవాడ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఆయనను భార్య మాన్యత, పిల్లలు, కుటుంబసభ్యులు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నపాటి స్వాగత వేడుకను నిర్వహించాలని సంజూ కుటుంబం భావించినప్పటికీ, భద్రతా కారణాలతో పోలీసులు దానిని తోసిపుచ్చారు.