సచిన్‌కు బీసీసీఐ సపోర్ట్‌ ఇంగ్లాండ్‌ సిరీస్‌ తర్వాత నిర్ణయం తీసుకునే ఛాన్స్‌

ముంబై,నవంబర్‌29:విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు మధ్ధతుగా నిలిచింది. కోల్‌కత్తా టెస్టుతో సచిన్‌ మళ్ళీ పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా మాస్టర్‌ రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతోన్న నేపథ్యంలో బోర్డు స్పందించింది. వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతోన్న టెండూల్కర్‌ గాడిన పడతాడని భావిస్తోంది. అయితే కోల్‌కత్తా , నాగ్‌పూర్‌ టెస్టుల్లో కూడా ఫెయిలైతే మాత్రం సచిన్‌ కెరీర్‌పై బీసిసిఐ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం ఇంగ్లాండ్‌ సిరీస్‌ తర్వాత అతనిపై నిర్ణయం వెలువడడం ఖాయంగా కనిపిస్తోంది. సచిన్‌ వైఫల్యాల గురించి బీసిసిఐ ఏ మాత్రం ఆందోళన చెందడం లేదని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. సచిన్‌ భారత్‌ క్రికెట్‌లో ఒక వజ్రమని , క్లిష్ట సమయంలో అతనికి సపోర్ట్‌ ఇవ్వాల్సిన బాధ్యత తమకుందని తెలిపారు.  ఇదిలా ఉంటే తన కెరీర్‌పై సెలక్టర్లే తుది నిర్ణయం తీసుకోవాలని సచిన్‌ చెప్పినట్టు వచ్చిన వార్తలను బీసిసిఐతో పాటు అతని సన్నిహితులు కొట్టిపారేశారు. విూడియాలో వచ్చిన ఈ కథనాలు పూర్తిగా అవాస్తమని వెల్లడించారు. సచిన్‌ సెలక్టర్లతో మాట్లాడిన విషయంపై అడిగితే మాస్టర్‌ చిరునవ్వు నవ్వాడని అతనికి సన్నిహితంగా ఉండే వ్యక్తి వ్యాఖ్యానించారు. అందులో వాస్తవం లేదని , తనకు సంబంధించినంత వరకూ మంచి ఆటతీరు కనబరచడమేనని , మిగిలిన విషయాలు పట్టించుకోనని సచిన్‌ చెప్పినట్టు తెలిపారు. ఇప్పటికే బీసిసిఐ కూడా ఈ విషయాన్ని తోసిపుచ్చింది. కేవలం విూడియాలో మాత్రం ఇవి వినిపిస్తున్నాయని బోర్డ్‌ సెక్రటరీ సంజయ్‌ జగ్ధాలే చెప్పారు. అటు భారత జట్టులోని సహచర ఆటగాళ్ళు కూడా టెండూల్కర్‌కే మధ్ధతిచ్చారు. ముంబై టెస్టులో సచిన్‌ ఒక్కడే విఫలమవలేదని , జట్టంతా సమిష్టిగా ఫెయిలైందని ఒక ఆటగాడు వ్యాఖ్యానించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు సచిన్‌ రాణించిన విషయాన్ని అందరూ మరిచిపోయారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.