సడక్ బంద్‌తో ఢిల్లీ కదలాలి
రహదారుల దిగ్బంధం విజయవంతం చేయండి
తెలంగాణ కోసం కలిసి కొట్లాడుదాం
ఆత్మబలిదానాలు వద్దు : కోదండరామ్
కామారెడ్డి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) :
సడక్‌బంద్‌తో ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం కదలాలని, కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేలా ఉద్యమ స్ఫూర్తిని చాటాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన పోరు గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కోసం 17 యేళ్ల విద్యార్థిని కవిత, వరంగల్ జిల్లాలో బీటెక్ విద్యార్థి నీరజ్ భరద్వాజ్‌తో సహా తొమ్మిది మంది ఇటీవల బలిదానాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. కవిత మరణానికి చేరువైనా నోట మాటరాకున్నా దుప్పటి కింది చేయెత్తి పిడికిలి భిగించి జై తెలంగాణ అని నినదించిందని కన్నీటిని ఆపుకుంటూ తెలిపారు. భరద్వాజ్ చివరగా తాను పుట్టిందే తెలంగాణకోసమని, తన బలిదానం సోనియాకు కనువిప్పు కలిగించాలని కోరుకున్నాడని గుర్తు చేశారు. ఉజ్వల భవిత ఉన్న యువత నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను తెలిపేందుకు ప్రాణాలు తృణప్రాయంగా అర్పిస్తున్నారని తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా పిలుపునిచ్చిన రహదారుల దిగ్బంధనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోరుకునే వారందరూ కలిసే కొట్లాడాలని, ఇందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రమే మనందరి ఆకాంక్ష అని, అది తప్ప వేరే లక్ష్యాలేమి లేవన్నారు. తెలంగాణ కోసం ఇప్పటి వరకు జరిగిన ఆత్మబలిదానాలు చాలని, ఇంకా ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోరాటాల పురిటి గడ్డని, ఉద్యమాల ద్వారానే ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎవరూ ఆకాంక్ష చాటేందుకు ఆత్మహత్యను మార్గంగా ఎంచుకోవద్దని కోరారు. ప్రతి ఒక్క గడప తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటోందని, ఇందుకోసం గతంలో ఎన్నోమార్లు పలు ఉద్యమాల ద్వారా చాటిచెప్పారని అన్నారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నెలరోజుల్లోగా తెలంగాణపై తేల్చేస్తామని ప్రకటించి మాట తప్పడంతోనే విద్యార్థులు మనోస్థైర్యం కోల్పోయి బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలైన సాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. జిల్లాకు చెందిన డి. శ్రీనివాస్, ఎంపీలు మధుయాష్కీ, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ద్రోహులని, వారు ఇప్పటికైనా పదవులు వదిలేసి ఉద్యమంలో పాలు పంచుకోవాలని కోరారు.