సత్యం రామలింగరాజు కుంభకోణం కథా…

ఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద వైట్ కాలర్ కుంభకోణం… సత్యం కంప్యూటర్స్ కేసు తుదితీర్పు వెలువడింది. సుమారుగా ఐదేళ్లపాటు సాగిన విచారణ చివరకు రామలింగరాజును దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి… 216 మంది సాక్షులను విచారించింది. 3 వేల 38 డాక్యుమెంట్లు పరిశీలించింది. శిక్షను ఖరారు చేయనున్నారు.
ఆరు నెలల క్రితం వాదనలు పూర్తి..
దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపిన సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజును కోర్టు దోషిగా తేల్చింది. ఆరు నెలల క్రితమే వాదనలు పూర్తికాగా తుది తీర్పు వెలువరించింది. రామలింగరాజుతోపాటు వడ్లమాని శ్రీనివాసరావు, శ్రీశైలం, రామరాజు, సత్యనారాయణరాజు, ప్రభాకర్ గుప్తా, వెంకటపతిరాజు, తాళ్లూరి శ్రీనివాస్, రామకృష్ణ, గోపాలకృష్ణన్‌పై నేరం రుజువైనట్లు కోర్టు తెలిపింది. ఇందుకు సంబంధించి 46 పేజీల తీర్పును వెలువరించింది.
కంపెనీ భారీ లాభాల్లో వున్నట్లు లెక్కలు..
సత్యం రామలింగరాజు..ఈ పేరు ఒకప్పుడు దేశంలోనే కాదు,.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. సాఫ్ట్ వేర్ రంగంలో సత్యం బ్రాండ్ నేమ్‌గా ముద్రపడింది. ఒకప్పుడు రామలింగరాజు.. సత్యం కంపెనీలో క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపే వారు. నిత్యం విదేశీ టూర్లు, ఫారెన్ డెలిగేట్స్‌తో మీటింగులతో బిజీగా ఉండేవారు. అలాంటి వ్యక్తి 2009 జనవరి 7 తర్వాత నిందితునిగా జైల్లోకి అడుగుపెట్టాడు. సత్యం కంప్యూటర్స్ సాఫ్ట్ వేర్ సంస్థను తానే స్వయంగా స్థాపించి దానికి చైర్మన్ కమ్ సీఈవో అయిన రామలింగరాజు,. కంపెనీ లెక్కలను తారుమారు చేశాడు. కంపెనీ భారీ లాభాల్లో ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించారు. దీన్ని తానే స్వయంగా మీడియాకు బహిరంగంగా వెల్లడించాడు. దీంతో సత్యం రామలింగరాజును సి.ఐ.డి. అరెస్ట్ చేసింది.
ఐదున్నర సంవత్సరాల్లో విచారణ..
సత్యం కుంభకోణం 7 వేల కోట్ల రూపాయల పైనేనని తేల్చడంతో.. సిఐడి నుంచి కేసు సిబిఐకి చేరింది. ఈ కేసులో మొత్తం మూడు చార్జీషీట్లను మూడు దఫాలుగా ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. 2009 ఏప్రిల్ 7న మొదటి చార్జీషీటు, 2009 నవంబర్ 24న రెండో చార్జీషీటు, 2010 జనవరి 7న తుది చార్జీషీట్‌ను దాఖలు చేసింది. ఇక కేసు విచారణను చేపట్టిన నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఐదున్నర సంవత్సరాల్లో విచారణను పూర్తిచేసింది. మొత్తం ఏడు వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని సిబిఐ ఆరోపించింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌లో జరిగిన అవకతవలు, ఆడిటింగ్‌లో ఏ విధంగా మోసాలకు పాల్పడ్డారో సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు సమర్థవంతంగా వినిపించింది. ఇప్పటివరకు ఈ కేసులో 216 మంది సాక్ష్యులను విచారించి, 3 వేల 38 డాక్యుమెంట్లను పరిశీలించింది కోర్టు.
4 కేసుల్లో 6 నెలల జైలు శిక్ష..
సిబిఐ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉన్నారు. రామలింగారాజు.. అతని సోదరుడు రామరాజు, సూర్య నారాయణ రాజు, మాజీ చీఫ్ పైనాన్స్ ఆఫీసర్ వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్స్ సుబ్రమణ్యం గోపాలకృష్ణ, టి. శ్రీనివాస్ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతి రాజు, శ్రీశైలం, వి.ఎస్. ప్రభాకర్ గుప్తాలు నిందితులుగా ఉన్నారు. వీరి పై 420, 120(బి), 409, 468, 477(ఎ), 201 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సత్యం కేసును ఐదు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. 2009 లో ఏపీ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో సి.పి.ఈ.ఓ.. కేసులో మొత్తం 7 కేసులకు తీర్పు ప్రకటించింది. ఇందులో 6 కేసుల్లో దోషులుగా తెల్చగా ..ఒక్క కేసులో నిర్దోషులుగా తేల్చింది. రామరాజుకు, రామలింగరాజుకు.. 5 కేసుల్లో 10 లక్షల చొప్పున జరిమానా విధించింది. రామ్ మైనంపాటికి 10 లక్షల జరిమానాతో పాటు.. ముగ్గురికి 4 కేసుల్లో 6 నెలల చొప్పున జైలు శిక్ష విధించింది.
మహిళకు 6నెలలు, మిగిలినవారికి ఏడాది జైలు శిక్ష..
ఇక అదాయపన్నుల ఎగవేత కేసుల్లో సత్యం కంప్యూటర్స్ అనుబంధంగా ఉన్న 19 సంస్థలకు నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సంస్థలకు చెందిన 84మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధించారు. రామలింగరాజు భార్య నందిని, కుమారుడు రామరాజు, సోదరుడి భార్య రాధతో పాటు 84మందికి శిక్ష పడింది. మహిళా నిందితులకు 6నెలలు, మిగిలినవారికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
2009లో విచారణ ప్రారంభించిన ఈడీ..
సత్యం కంప్యూటర్స్ కేసుపై ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. 2009లో ఈ కేసును ప్రారంభించిన ఈడీ విచారణను కొనసాగిస్తోంది. గతేడాది ఈకేసులో ఈడీ 822 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్‌మెంట్‌ చేసింది. నాంపల్లి ప్రత్యేక ఆర్ధిక నేరాల కోర్టులో ఈడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో తొలి ముద్దాయిగా సత్యం రామలింగరాజును పేర్కొంది. మిగిలిన నిందితులుగా 47 మందిని, 157 సంస్థలను తెలిపింది. ఇక సెబి 18 వందల కోట్ల రూపాయలను ఆరు సంవత్సరాల వడ్డీతో సహా చెల్లించాలని అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ కేసుల్లో మొత్తం రెండు చార్జీషీట్లతో పాటు 18 మంది నిందితులు ఉన్నారు.