సబిత హాజరీ

అవినీతి కేసులో కోర్టు పిలుపు
బోనెక్కనున్న తొలి హోం మంత్రి
హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) :
అవినీతి కేసులో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలో బోనెక్కనున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్‌ 7న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు తాఖీదులు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్‌ సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఐదో చార్జిషీట్‌లో సబిత సహా పన్నెండు మందికి కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, పునీత్‌ దాల్మియ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌, సజ్జల దివాకర్‌రెడ్డి, సంజయ్‌మిశ్రా, నీల్‌కమల్‌, జయదీప్‌ బసు, రఘురామ్‌ సిమెంట్స్‌, దాల్మియా సిమెంట్స్‌, ఈశ్వర్‌ సిమెంట్స్‌లను నిందితులుగా చేర్చింది. దాల్మియా సిమెంట్స్‌ను పరిగణలోకి తీసుకున్న విచారణ జరిపింది. నిందితులందరిపై ఐపీసీ సెక్షన్‌ 120 (బీ) రెడ్‌విత్‌ 420, 409లు పీసీ యాక్ట్‌ 9, 12, 13(1), (2) సీ అండ్‌ డీ కింద సీబీఐ అధికారులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విచారణ అనంతరం 62 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఇందులో 53 అదనపు డాక్యుమెంట్లు కూడా చేర్చారు. 47 మంది సాక్షులుగా ఉన్నట్టు సీబీఐ పేర్కొంది. చంచల్‌గూడ జైల్‌లో ఉన్న ప్రధాన నిందితుడుజగన్మోహన్‌రెడ్డిని కూడా కోర్టు ఎదుట హాజరు పరచాలని న్యాయమూర్తి చంచల్‌గూడ జైలు అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు న్యాయమూర్తి జగన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన హోంశాఖ మంత్రి 420గా అభియోగాలు ఎదుర్కొంటూ కోర్టు బోనెక్కడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఆమె రాజీనామా చేసి విచారణ సజావుగా సాగేలా సహకరించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.