సబ్సిడీలు నేరుగా ఇచ్చేందుకే ‘నగదు బదిలీ’

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌, జూన్‌ 1 (జనంసాక్షి) :
సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకు అందించేందుకే నగదు బదిలీ పథకమని ముఖ్యమంత్రి  ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఉదయం నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆయన నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, సర్వే సత్యనారాయణ, ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆధార్‌తో గ్యాస్‌ కనెక్షన్‌ అనుసంధానం చేసి నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. మొట్ట మొదట సిలిండర్‌ను బుక్‌ చేయగానే నగదు రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమచేస్తారన్నారు. సిలిండర్‌ తీసుకోగానే రెండో సిలిండర్‌కు సంబంధించిన సొమ్ము జమ అవుతుందన్నారు. అయితే ఈ నగదు బదిలీ పథకంపై కొందరు విమర్శలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని హితవు పలికారు. గ్యాస్‌ కనెక్షన్లలో బినామీలను తొలగించేందుకే నగదు బదిలీ పథకం ప్రవేశ పెట్టామన్నారు. లబ్ధిదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శనివారం నుంచి హైదరాబాద్‌, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ పథకం అమలులోకి వచ్చిందన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటి వరకు 57 శాతం మాత్రమే గ్యాస్‌ వినియోగదారులు ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకున్నారన్నారు. మిగిలిన వారు కూడా త్వరలోనే చేసుకుని ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధార్‌, గ్యాస్‌, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వారి సంఖ్య 23 శాతమే ఉందన్నారు. మిగిలిన వారు బ్యాంకు ఖాతాలను తెరిచి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు. గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం రూ.442.50 సబ్సిడీ ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉండే గ్యాస్‌ వినియోగదారుడు రూ.412.20 చెల్లిస్తున్నాడని, మరో రూ.25లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి తరఫున భరిస్తోందన్నారు. మొత్తంమీద గ్యాస్‌ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 5200 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందిస్తోందన్నారు. అలాగే, విద్యుదుత్పత్తికి అవసరమైన గ్యాస్‌ను కూడా అందించి కరెంట్‌ కష్టాలు తీర్చేందుకు కృషి చేయాలని కేంద్రమంత్రులను కోరుతున్నానన్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర జనాభా 8,47,00,000 కాగా, ఇప్పటి వరకు 7,70,00,000 మంది మాత్రమే ఆధార్‌ నమోదు చేసుకున్నారన్నారు. మరో 70, 80 లక్షల మంది ఆధార్‌ నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. వారు కూడా సకాలంలో చేసుకుంటే మన రాష్ట్రం ఆధార్‌ నమోదులో నూరుశాతం చేరినట్టు అవుతుందన్నారు. అయితే 70 శాతం మందికే ఆధార్‌ కార్డులు అందాయని, మిగిలిన వారికి సకాలంలో అందనున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తొలుత కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ, దళారుల నుంచి గ్యాస్‌ వినియోగదారులను రక్షించేందుకే కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని చేపట్టిందన్నారు. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే దీపం పథకం కింద లబ్ధిదారులకు మేలు చేకూరుస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిని అభినందిస్తున్నానని అన్నారు. ఆధార్‌ ద్వారా గ్యాస్‌కు అనుసంధానంచేసి తద్వారా బ్యాంకు ఖాతాలో లబ్ధిదారులకు నేరుగా అందించడమే యుపిఎ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు సబ్సిడీపై ప్రతియేటా తొమ్మిది సిలిండర్లను మాత్రమే ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు. తొమ్మిది దాటితే మార్కెట్‌ ధర చెల్లించాల్సిందేనన్నారు. నగదు బదిలీ పథకంపై ఎవరు ఎటువంటి అపోహలు రేకెత్తించినా వాటిని పట్టించుకోవద్దని, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.