సబ్‌ప్లాన్‌ చేశామని గొప్పలు చెప్తారు

దళిత ఎంపీలకు ఇదేనా గౌరవం?
చలో అసెంబ్లీతో సత్తా చాటుదాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌1 (జనంసాక్షి) :
ఎస్సీ, ఎస్టీల కోసం సబ్‌ప్లాన్‌ అమలు చేశామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దళిత ఎంపీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టబోయే ‘చలో అసెంబ్లీ’ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చలో అసెంబ్లీకి సంబంధించి ఈ నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రచార యాత్రలు చేపడుతామని తెలిపారు. దళతి ఎంపీలు రాజీనామా చేస్తే కాంగ్రెస్‌ అధిష్టానం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దళితులపై కాంగ్రెస్‌కు ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. అదే కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తే అధిష్టానం ఆయన్ను పిలిచి మాట్లాడిరదని గుర్తు చేశారు. ప్రధాని స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారని అన్నారు. తెలంగాణ అంశం గాని, దళిత ఎంపీలు గాని కాంగ్రెస్‌ నేతలకు పనికారారా అని ఆయన ప్రశ్నిచారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలపై అధిష్టానం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఎంపీలు డెడ్‌లైన్లు పెట్టడం కాదు, కాంగ్రెస్సే పలుమార్లు తెలంగాణకు డెడ్‌లైన్లు పెట్టిందని గుర్తు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని మండిపడ్డారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తే ప్రధాని పిలిచి బుజ్జగించారని, తెలంగాణ దళిత పార్లమెంటు` సభ్యులు రాజీనామా చేస్తే పట్టించుకోలేదని న్‌ కోదండరామ్‌ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌పై మండిపడ్డారు. ఈ నెల 14 తేదీన తలపెట్టిన చలో అసెంబ్లీ పోస్టరును ఆయన శనివారం విడుదల చేసి మాట్లాడారు.ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చే పైసలకు కేంద్రం లొంగిపోతోందని, డబ్బు సంచులకే కేంద్రంలో విలువ ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణకు గడువులు పెట్టింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. కేంద్రం అన్ని విలువలూ కోల్పోయి దిగజారిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్రాన్ని నిలదీయడానికే ఈ నెల 14వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అన్ని విలువలకూ తిలోదకాలిచ్చి దిగజారి వ్యవహరిస్తోందని కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన విలువలూ లేవని, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తోందని ఆయన అన్నారు. సబ్‌ ప్లాన్‌ అంటూ హడావిడి చేస్తూ అదే సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటు` సభ్యులు పార్టీని వీడుతుంటే పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఓ రకంగా దళితులను, తెలంగాణను అవమానపర్చడమే అన్నారు. తెలంగాణ చాలా పాత డిమాండ్‌, తెలంగాణవాదం ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితం కాదని స్పష్టం చేశారు.