సమన్వయ లోపముంది

మానవ తప్పిదం లేదు
ప్రకృతి వైపరీత్యమే
కుళ్లిన శవాల డీఎన్‌ఏలు భద్ర పరుస్తాం
హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే
డెహ్రాడూన్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. సహాయక చర్యల్లో సమన్వయ లోపాలు ఉన్నమాట నిజమేనని ఆయన అంగీకరించారు. సహాయక బృందాల మధ్య మరింత సమన్వయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా మృతదేహాలను గుర్తించలేదని చెప్పారు. ఉత్తరాఖండ్‌ విపత్తు మానవ తప్పిదం వల్ల వచ్చినది కాదని, ఇది ప్రకృతి వైపరీత్యమని తెలిపారు. వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో షిండే శనివారం పర్యటించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ, ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సవిూక్షించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. భేటీ అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంకా 40 వేల మంది వరదల్లో చిక్కుకొని ఉన్నారని, వారిని సురక్షితరంగా తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మరో మూడ్రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో ప్రభుత్వ సంస్థల సమన్వయ లోపం ఉందని తెలిపారు. దాన్ని అధిగమించి, మూడ్రోజుల్లోపు బాధితులను తరలించాలని గడువు విధించినట్లు చెప్పారు. విపత్తు నిర్వహణ నిపుణుడు వీకే దుగ్గల్‌ సమన్వయం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్‌ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో స్పందించారు. జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఏమిటో చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రోడ్లు పాడైన చోట తాత్కాలిక ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యాత్రికులను తరలించేందుకు గౌరికుంద్‌`కేదార్‌నాథ్‌, పాండుకేశ్వర్‌`బద్రినాథ్‌ల మధ్య ఫుట్‌బ్రిడ్జ్‌లు నిర్మిస్తామన్నారు. జంగిల్‌చట్టిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భద్రతాబలగాలు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో లభించిన కొన్ని మృతదేహాలు పూర్తిగా ఛిద్రమైపోయాయని, వారిని గుర్తించడం కష్టంగా మారిందన్నారు. మృతదేహాల నుంచి డీఎన్‌ఏ సేకరించి నిల్వ ఉంచనున్నట్లు చెప్పారు. ఉత్తరాఖండ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని హోం మంత్రి చెప్పారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌కు ప్రధాని రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారని, అవసరమైన నిధులు విడుదలు చేశామన్నారు. ఇది దేవతల భూమి కాబట్టి కేంద్రం నిరంతరం సాయం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. 17 మంది విదేశీయులను రక్షించామని, సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు.