సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ

కలెక్టర్‌ ఆదేశాలతో కదులుతున్న అధికారులు

ఆదిలాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు అర్హులైనలబ్ధిదారులకు అందడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు, ఆహార భద్రత కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లాంటి పథకాలను సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ చొరవ చూపుతున్నారు. సర్పంచితో పాటు గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అక్కడ నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా వైద్యఆరోగ్య శాఖతో పాటు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.. పౌష్ఠికాహారం అందించడంలో గానీ, పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో గానీ వైద్య సేవల్లో నిర్లక్ష్యం కనిపిస్తే వెంటనే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. అంతే కాకుండా తాగునీటి సౌకర్యం లేని గ్రామాల్లో బోరు బావులు, బావుల మంజూరు కోసం దరఖాస్తులను ఆహ్వానించి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి సంబంధిత అధికారులతో సదుపాయాలను సమకూరుస్తున్నారు. సవిూక్ష సమావేశంలో ఆయా గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్తారు. కలెక్టర్‌ అనుమతితో సమస్యలను పరిష్కరిస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే అనుబంధ గ్రామాల ప్రజలు ప్రధానంగా ఎదుర్కోంటున్న సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఉపాధ్యాయుల హాజరు విషయంలోదృష్టి సారిస్తున్నారు. గ్రామ పంచాయతీ అంతర్గత రోడ్ల విషయంలో కాకుండా రవాణా కోసం కల్వర్టులు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో శ్రద్ధ వహించి సమస్యను పరిష్కరిస్తున్నారు. అంతే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, భవనాల మరమ్మతుల విషయంలో, మహిళలకు, చిన్నారులకు అందుతున్న పౌష్ఠికాహారాన్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అంతే కాకుండా ప్రజల ఆరోగ్య పరిస్థితుల విషయంలో నేరుగా ప్రజలను అడిగి తెలుసుకొని వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.

 

 

తాజావార్తలు