సమస్యల పరిష్కారంలో విఫలం :బిజెపి
ఆదిలాబాద్,జనవరి24(జనంసాక్షి): ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో తెలంగాణలో టిఆర్ఎస్ ప్రబుత్వం పూర్తిగా విఫలమయ్యిందని,కేసీఆర్ సర్కారు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అమలు సాధ్యం కాని హావిూలు గుప్పిస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. ప్రజా సదస్సులకు శ్రీకారం చుడుతున్నామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. రైతులు కష్టపడి పండించిన కోనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకే ఈసారి పత్తి పంటకు బదులు కందులు, సోయాబీన్ పంటలను వేశారన్నారని గుర్తు చేశారు. కందులు కొనుగోళ్లలో తేమశాతం 12 కన్నా ఎక్కువ ఉందంటూ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారన్నారు. కంది రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కందులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలు, ఆత్మ బలిదానాలతో వచ్చిన రాష్ట్రంలో తమ సమస్యలు తీరుతాయని భావించిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. 1.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మూడేళ్లలో కేవలం 16 వేలు మాత్రమే భర్తీ చేశారన్నారు. మతప్రాతిపదికన ముస్లిం రిజర్వేషన్లను ఏవిధంగా సమర్ధిస్తారని ప్రశ్నించారు. వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని విమర్శించారు. మతం ప్రాతిపదికన తీర్థయాత్రల పేరిట ప్రజాధనం వెచ్చించడాన్ని వ్యతిరేకించిన ఒవైసీ… తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఇస్లామిక్ సెంటర్‌పై ఎంఐఎం వైఖరి స్పష్టం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ, సింగరేణి కార్మికుల సమస్యలు, ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగం, బోధన బకాయిలు, మద్యం మహమ్మారిపై పోరాటాలు, సదస్సులు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, హావిూలు అమలు చేయకపోవడంపై పోరాడుతామని అన్నారు. ప్రజా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే మార్కెట్ యార్డులో అధికారులు కందుల కొనుగోళ్లలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డులో కందులు ఎందుకు కొనుగోలు చేయడం లేదని సంబంధిత అధికారులను నిలదీశారు.