సమాచార హక్కు చట్టం ఏర్పడి 17సంవత్సరాలు అవుతుంది(2005అక్టోబర్ 12)
అవినీతిరహిత సమాజాన్ని నిర్మిద్దాం-అధికారులూ సహకరించండి
అవినీతి అధికారులకు లంచాలు కాదు సమాచార దరఖాస్తులు ఇద్దాం….
వావిలాల రాజశేఖర శర్మ,స.హ చట్ట ఉద్యమ కారుడు….
నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్11(జనంసాక్షి)
సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రమని,ఈ ఆయుధంతో అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలని సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు వి.రాజశేఖర శర్మ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు లంచాలు అడిగితే ఇవ్వవద్దు అని సమాచార దరఖాస్తులు చేసి తమ పనులు చేసుకోవాలని సూచించారు.అంతేకాకుండా ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని సేకరించి పధకాలలో వచ్చే నిధులు,ఖర్చులు వంటి వివరాలు తెలుసుకోవచ్చని ప్రభుత్వంలోని రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల్లోని ప్రతి సమాచారాన్ని సేకరించి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని తెలిపారు.చట్టం వచ్చినప్పటి నుండి
కుంభకోణాలు వెలుగుచూశాయని ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని వినియోగించుకోవాలన్నారు.జిల్లాలోని సహ దరఖాస్తు దారులకు అధికారులు వెంటనే స్పందించి అడిగిన సమాచారాన్ని,తమ వద్ద ఉన్న సమాచారాన్ని సకాలంలో ఇచ్చి అవినీతి రహిత సమాజానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు కనిపించే విధంగా ఆ కార్యాలయంలో పనిచేసే అధికారుల జీత భత్యాలకు,జమ,ఖర్చుల కు సంబంధించిన సెక్షన్(4)1బి దస్త్రాలను సక్రమంగా నిర్వహించడం లేదని విచారం వెలిబుచారు.