సమాజ హితానికి కృషి చేయాలి

– విద్యార్థులకు ప్రధాని మోదీ పిలుపు
– ఘనంగా విశ్వభారతి విద్యాలయ 49వ స్నాతకోత్సవం
– పాల్గొన్న సీఎం మమత బెనర్జీ, బంగ్లాదేశ్‌ ప్రధాని హసీనా
కోల్‌కతా, మే25(జ‌నంసాక్షి) : సమాజ హితానికి కృషి చేయాలని విశ్వభారతి విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. మోదీతో పాటు బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలో శాంతినికేతన్‌ పరిసరాల్లో ఉన్న 100 గ్రామాలను స్వయం సమృద్ధం చేయాలని కోరారు. 2021లో విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయని, అప్పటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. శాంతినికేతన్‌ పరిసరాల్లోని 100 గ్రామాల ప్రజలకు విద్యుత్తు కనెక్షన్‌ ఉండాలని, ప్రతి కుటుంబానికీ వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలని, ప్రతి బిడ్డకూ వ్యాక్సినేషన్‌ జరగాలని, డిజిటల్‌ ఫారాలను గ్రావిూణులు నింపగలగాలని, ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలని దీని కోసం విద్యార్థులు కృషి చేయాలని కోరారు. బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రెండు దేశాల ప్రధాన మంత్రులు పాల్గొనడం అత్యంత అరుదైన విషయమని చెప్పారు. సాహిత్యంలో నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతినికేతన్‌లో విశ్వభారతి కళాశాలను 1921 డిసెంబరులో ప్రారంభించారు. 1913లో నోబెల్‌ బహుమతి క్రింద వచ్చిన సొమ్మును ఈ కళాశాల ఏర్పాటుకు వినియోగించారు.
శాంతి నికేతన్‌లో అరుదైన దృశ్యం…
నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను ఏకి పారేయడంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎప్పుడూ ముందే ఉంటారు. పెద్ద నోట్ల రద్దు, మొబైల్‌ సిమ్‌లకు ఆధార్‌ అనుసంధానం వంటి అంశాలపై ఆమె తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అలాంటి మమత శుక్రవారం ప్రధాని మోదీతో కలిసి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వీరిద్దరూ పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రెండు దేశాల ప్రధాన మంత్రులు హాజరైన అరుదైన సంఘటన
శుక్రవారం జరిగింది. శాంతినికేతన్‌కు ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో చేరుకున్న వెంటనే మమత బెనర్జీ సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు శాలువ కప్పి, పూలగుచ్ఛం అందజేసి, నమస్కరించారు. మోదీ కూడా మమతను సాదరంగా పలుకరించారు. అనంతరం ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో షేక్‌ హసీనా, మమత బెనర్జీ, నరేంద్ర మోదీ ఒకే వేదికపై ఆశీనులయ్యారు. ఇదిలావుండగా, మమత బెనర్జీ కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి సవాలు విసిరేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని మమత పిలుపునిచ్చారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఆకాశానికి ఎగబాకుతుండటంపై కూడా మమత బెనర్జీ గురువారం స్పందించారు. వీటి ధరలను తగ్గించేందుకు సమర్థవంతమైన చర్యలను తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి చర్యలను కూడా ఆమె తీవ్రంగా ఎండగట్టిన సంగతి తెలిసిందే.