సమైక్యవాదంపై ‘కావూరి’ యూటర్న్‌

తెలంగాణ ఇస్తే ఓకే
ఇప్పుడు నేను కేంద్ర మంత్రిని
గ్రామ సర్పంచును కాదు
అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా : కావూరి
హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) :
సమైక్యవాదంపై ఏలూరు ఎంపీ, కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు యూటర్న్‌ తీసుకున్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారిగా హైదరాబాద్‌ వచ్చిన కావూరికి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనస్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జౌళిశాఖ మంత్రిగా సోనియాగాంధీ మన్మోహన్‌సింగ్‌లు తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అయితే తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొనాలంటే కేంద్రమంత్రి స్థాయి నుంచి సర్పంచ్‌ స్థాయికి దిగజారాలా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తానిప్పుడు సర్పంచ్‌ను కాదని, కేంద్ర మంత్రిని అనే అర్థం ధ్వనించేలా మాట్లాడారు. జైలులో ఉన్న జగన్‌ను కాంగ్రెస్‌ పార్టీ సమర్థంగా ఎదుర్కొన్నదీ లేనిదీ రానున్న ఎన్నికలే తేలుస్తాయని ఆయన అన్నారు. వైఎస్సార్‌ సీపీ పరిస్థితి ఉప ఎన్నికలకు, ఇప్పటికీ చాలా తేడా ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై మాటిమాటికి అభిప్రాయాలు మారవని, పదవీ వచ్చినంత మాత్రాన అభిప్రాయాలు మార్చుకునేంత బలహీనుడిని కానని ఆయన అన్నారు. పార్టీకి రాజీనామా చేస్తానని  బెదిరించడం వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందన్న వార్తలను ఆయన ఖండిరచారు. కాంగ్రెస్‌ పార్టీకి తాను చేస్తున్న సేవ ద్వారానే తనకు పదవి వచ్చిందని కావూరి స్పష్టం చేశారు. జౌళి శాఖ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఆయన అన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తన వంతు ప్రయత్నిస్తానని కావూరి అన్నారు. త్వరలో చేనేత కార్మికులకు రుణ మాఫీ పథకాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. 3,400 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని అన్నారు. చేనేత కార్మికులకు నిరంతరాయంగా విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.