సరబ్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
నివాళులర్పించిన రాహుల్, ప్రకాశ్‌సింగ్ బాదల్
రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం
అమృతసర్, మే 3 (జనంసాక్షి):
పాకిస్తాన్ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సరబ్‌జిత్‌కు యావత్‌భారతం కన్నీటితో నివాళులర్పించింది. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకొంటూ అంతిమ వీడ్కోలు పలికింది. వేలాది మంటి వెంటరాగా కన్నీటి నివాళుల మధ్య ఉద్వేగా వాతావరణం నడుమ సరబ్‌జిత్‌సింగ్ అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. సరబ్‌జిత్ స్వగ్రామం పంజాబ్‌లోని భిజివిండ్‌లో శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. అంతిమ యాత్రకు ప్రముఖు లతో పాటు వేలాది మంది తరలివచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ప్రణీత్‌కౌర్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ సహా పలువురు వీఐపీలు అంతిమ యాత్రకు హాజరయ్యారు.పాక్ నుంచి తీసుకువచ్చిన సరబ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. తొలుత నివాసంలో ఉంచినప్పటికీ, ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో వారి సందర్శనార్థం స్తానిక స్కూలుకు తరలించారు. వేలాది మంది వచ్చి సరబ్‌జిత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పార్తీవ దేహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచడంతో అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో సరబ్‌జిత్
సోదరి దల్బీర్ కౌర్, భార్య సుఖ్‌ప్రీత్ కౌర్, కూతుళ్లు స్వప్నదీప్, పూనమ్‌లు ఆసీనులయ్యారు. అంతకుముందు సరబ్‌జిత్ మృతదేహంపై మువ్వన్నెల పతాకాన్ని కప్పి, పోలీసులు నివాళులర్పించారు. ప్రత్యేక వాహనం చుట్టూ ఉండి శ్మశానానికి తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు.