సరబ్‌జిత్‌ సింగ్‌ విషాదం-దేశభక్తి


పరాయి గడ్డమీద చావుకూ బతుక్కూ మధ్య వేలాడుతూ సర బ్‌జిత్‌ సింగ్‌ 22 ఏళ్ల జైలు జీవితం విషాదంగా ముగిసింది. 1990 లాహోర్‌ బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన సరబ్‌జిత్‌కు పాక స్తాన్‌లోని తీవ్రవాద నేరాల్ని విచారించే కోర్టు మరణశిక్ష విధిం చింది. ఇండియాతోపాటు పాకిస్తాన్‌ హక్కుల సంఘాలు అతను అమాయకుడని, సాధారణ రైతు అని, పొరపాటున సరిహద్దు దాటాడని అన్నాయి. పాకిస్తాన్‌ ప్రభుత్వం, న్యాయస్థానాలు అతడు భారతదేశానికి చెందిన తీవ్రవాది అన్నాయి. సరబ్‌జిత్‌ నేరం ఒప్పు కోలును ప్రాసిక్యూషన్‌ రికార్డు చేసింది. భారత నిఘా సంస్థ ‘రా’ (రీసర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌), ఆర్మీ చేతుల్లో శిక్షణ పొందానని అతనే స్వయంగా ఒప్పుకున్నాడు గనక సుప్రీం కోర్టు కూడా మరణశిక్షను ఖరారు చేసింది. అధ్యక్షుడు ముషారఫ్‌ అతని క్షమాభిక్ష అభ్యర్థనను నిరాకరించాడు. చివరికి అనేక పిటిషన్లు, వాయిదాలతో అతను జీవితకాలం కన్నా ఎక్కువ జైలు శిక్ష అనుభవించాడు కనక అతని మరణశిక్షను రద్దు చేసి విడుదల చేయమని మానవ హక్కుల సంఘాలు అభ్యర్థించాయి. కసబ్‌, అఫ్జల్‌ గురుల ఉరిశిక్ష తర్వాత కూడా భారతదేశపు చర్యలను పరిగణలోకి తీసుకోకుండా సరబ్‌జిత్‌ విషయం మానవతా దృక్పథంతో ఆలోచించాలని ఇటు కశ్మీర్‌, అటు పాకిస్తాన్‌కు చెందిన ప్రజాస్వామికవాదులు అభ్యర్థించారు. భారతదేశంలో ఎట్లయితే భూమయ్య, క్రిష్ణాగౌడ్‌ల ఉరిశిక్ష మొదలుకొని అఫ్జల్‌గురు దాకా మరణశిక్షకు వ్యతిరేకంగా వినిపించిన ప్రజా స్వామిక గొంతుకలను ప్రభుత్వాలు ఖాతరు చేయలేదో పాకిస్తాన్‌ ప్రభుత్వాలూ అట్లాగే ఖాతరు చేయలేదు. సరబ్‌జిత్‌కు ఉరి పడలేదు గాని అనుమానాస్పదంగా తోటి ఖైదీల చేతుల్లో హత్యచేయబడ్డాడు.

జరిగిన దారుణానికి చలించని వారెవరూ ఉండరు. అయితే సరబ్‌ జిత్‌ సింగ్‌ విషాదం కన్నా విషాదం ఏమిటంటే ఒక మనిషిని అన్యా యంగా చంపితే దు:ఖించిన వారే మరో మనిషిని చంపినప్పుడు హర్షాతిరేకాలు ప్రకటించడం. జాతులు, సరిహద్దులు మనిషిని రద్దు చేసి, మానవ సహజమైన భావావేశాలను నియంత్రించడం. ఏ సా క్షాలూ, నిరూపణలు లేకుండా, జాతీయతనుబట్టి, మతాన్నిబట్టి అనుమానాల ఆధారంగా నేరం ఆరోపించబడ్డ వ్యక్తిని రాజ్యం తీవ్రవాదిని చేస్తే మీడియా దానికి ప్రజల మద్దతు కూడగడుతుంది. అదే పరాయిదేశం చేస్తే హక్కుల గురించి మాట్లాడుతుంది. అఫ్జల్‌ గురును రహస్యంగా ఉరితీసి కుటుంబానికి శవాన్ని కూడా అప్పగిం చకుండా పూడ్చిపెడితే మీడియా పార్లమెంటుపై దాడిలో చనిపోయి న కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేస్తుంది. నిజానికి ఆ దాడికి అఫ్జల్‌ గురుకు సంబంధం ఉన్నట్లు ఏ ఆధారమూ లేదన్న విషయం బహుషా ఆ కుటుంబానికి తెలిసి ఉండదు. కనీసం మృతదేహానన్ని అప్పగించాలని కోరుతున్న అఫ్జల్‌గురు కుటుంబం గాని, వేలాది కశ్మీరీ ప్రజల నిరసనలు గాని భారత మీడియా దృష్టిని తావు. ఇప్పుడు దు:ఖావేశంలో మునిగిపోయిన సరబ్‌జిత్‌ కుటుంబాన్ని పదేపదే చూపిస్తూ, పాలక, ప్రతిపక్షాల ఉద్రేకపూరిత ప్రకటనలకు తనవంతు ఎగదోస్తున్న మీడియా ఈ పరిస్థితి యుద్ధానికి దారితీయాలని కోరుకుంటున్నట్లు కనపడి దిగ్భ్రాంతి కలుగ జేసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎంతగా రగు ల్కొంటాయో అంతగా ఇరుదేశాల జైళ్లలో ఖైదీల పరిస్థితి చావు బతుకుల మధ్య కొట్టుకులాడుతుంది. (పోయిన సంవత్సరం ముగ్గురు పాకిస్తానీ ఖైదీలు భారతజైళ్లలో అనుమానాస్పదంగా మరణిస్తే పాకిస్తాన్‌ మీడియా స్పందిన ఇంతకంటే భిన్నంగా లేదు. ఇక్కడ అది వార్తే కాలేదు.) టిఆర్‌పి రేటింగుల పోటీల్లో ఇటువంటి ఉద్రిక్తతల పర్యవసానాల్ని పట్టించుకునే విచక్షణను మీడియా కోల్పోయింది. సామ్రాజ్యవాద యుగంలో నాలుగో స్తంభం నిర్వర్తించే పాత్రా మారిపోయింది. భారతదేశపు జైళ్లల్లో ప్రతిరోజూ సగటున నలుగురు ఖైదీలు మరణిస్తున్నారు. వీళ్లకెవరికీ పరాయిదేశంలో చనిపోయినప్పుడు వచ్చే ఘనత కానీ సానుభూతి కానీ రాదు. 2001 నుండి 2011 వరుకు దాదాపు 13వేల మరణా లు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి పోయాయి. పోలీసు కస్టడీ మరణాలు, ఎన్‌కౌంటర్‌ హత్యలు వీటికి అదనం. టెర్రరిస్టుల పేరుతో ముస్లింలను, మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను ఏమైనా చేసే అధికారాలు ప్రభుత్వాలు చలాయిస్తున్నప్పుడు, సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటించి వందల సంఖ్యలో ప్రజల్ని ఊచకోత కోస్తున్నప్పుడు వాచ్‌డాగ్స్‌ నిశ్శబ్దంగా ఉన్నాయి. దేశభక్తి, జాతీయ తా భావనలకు అర్థాలు మారిపోయాయి. అందువల్ల సరిహద్దుల రక్షణ గురించి మాట్లాడుతూ సామ్రాజ్యవాద దేశాల నియంత్ర ణలోకి దేశం పూర్తిగా జారిపోతున్నదన్న వాస్తవాన్ని లెక్కచేయకపోతే దేశభక్తి లేదని అనలేం. సామ్రాజ్యవాదులు దేశ మూలుగులను పీల్చేసినా ఫరవాలేదు. మూడు రంగులూ ఒంటికి పూసుకొని అవకాశం, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్‌ జెండాను నడిరోడ్డు మీద తగలేస్తే దేశభక్తిని చాటుకున్నట్లే. నేనిక్కడ పుట్టాను కాబట్టి ఇది పవిత్రభూమి. నేను పక్కదేశంలో పుట్టలేదు కాబట్టి అది ద్వేషిం చవలసిన జాతి. అందువల్ల పొరుగు దేశం యావత్తూ రాక్షస మూ కలని చాటితే కాని భారత జాతీయతను సరిగ్గా నిర్వచించనట్లు. సరబ్‌జిత్‌ మరణించిన మరుసటిరోజే జమ్మూ జైల్లో పాకిస్తానీ ఖైదీపై హత్యాప్రయత్నం జరగడం దేశానికేమీ గర్వకారణం కాదు అని గ్రహించగలిగే స్థితిలో భారతసమాజం లేదు. కనీసం రెండు దేశాల్లో వందలసంఖ్యలో సరిహద్దులు దాటిన ఖైదీలున్నారు అన్న గ్రహింపైనా అటు రాజకీయ పార్టీలకు, ఇటు మీడియాకు లేదు. సంఘపరివార్‌ నిర్వచించి, నిర్దేశిస్తున్న దేశభక్తి భావజాలాన్ని చాటే విషయంలో రాజకీయ పక్షాలేవీ భిన్నంగా లేవు. దానికి కారణం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికే కాదు, కనీసం వాటిని అడ్రస్‌ చేసే స్థితిలో ఏ రాజకీయ పార్టీల పాలసీలు లేవు. ఇటువంటప్పుడే అవి ఒక అమూర్త శత్రువును తయారు చేసి ప్రజలకు చూపిస్తాయి. రెండు దేశాల పౌరులూ పాలకవర్గాల చేతుల్లో పీడించబడుతున్న ప్రజలే అన్న వాస్తవ గ్రహింపు లేకపో వడం ఒకటైతే ఇక్కడ దేశభక్తి అంతకంతకూ సంకుచితమై ఒక మతానికి సంబంధించిన గుత్తా సొత్తైపోవడం సామాజిక పతనానికే దారితీస్తుంది. ముస్లిం మతస్తులను పరాయిగా చూసి, అనుమానిం చే దేశభక్తి నిశ్శబ్దంగా విస్తరిస్తున్నది. ఇది దేశాభివృద్ధి భావనతో పెనవేసుకొని నడుస్తున్నది. నరేంద్రమోడీ వంటి నాయకుడు తీవ్రవాదులనణచివేయడంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించగ లడన్న ప్రచారం ఒక ఉదాహరణ. ఎన్నికల ముందు సమర్థవం తమైన, శక్తివంతమైన నాయకత్వం అని నిరూపించుకునే ప్రయత్నంలో దేశాల పాలక పక్షాలు యుద్ధానికి కాలుదువ్వడమో, లేక తనకందుబాటులో ఉండే ‘తీవ్రవాదిని’ మట్టుబెట్టడమో చేస్తాయి. సంక్షోభాలనెదుర్కునే శక్తి పాలకవర్గాలకు సన్నగిల్లుతు న్నది. నిజమైన శత్రువును ప్రజలెక్కడ గ్రహిస్తారోనన్న భయం వాటికి పట్టుకుంది. ఈ దశలో అవి మరింత కౄరంగా తయారవుతాయి. ప్రజల మెదళ్లలోకి విషాన్నెక్కిస్తాయి. దేశభక్తి పేరుతో రెచ్చగొట్టే విపరీత జాతీయతా భావన (జింగోయిజం) అట్లాంటిదే. దీనిని అర్థం చేయించే రాజకీయాలు ప్రజలకు చేరకపో తే సమాజం దారుణాలను కళ్లజూడాల్సి వస్తుంది.
-పి.వరలక్ష్మి