సరైన సమయంలో నిర్ణయం : కలామ్
బిహ్తా (బీహార్) : రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రకటించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఆ అత్యున్నత పదవికి పోటీ చేయడంపై సరైన సమయంలో తాను తగిన నిర్ణయం తీసుకుంటానని శుక్రవారం బీహార్‌లోని బిహ్తాలో విలేకరులతో చెప్పారు. ‘చాలా మంది రాజకీయ నాయకులు నాతో మాట్లాడి రాష్ట్రపతి కావలసిందని కోరారు. ఈ ఆలోచనను హర్షిస్తున్నాను. వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటాను’ అని ఆయన తెలిపారు. ఒక స్థానిక కళాశాలలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కలామ్‌ను విలేకరులు రాష్ట్రపతి పదవికి రంగంలో ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధిని కలుసుకున్న అనంతరం సమాజ్‌వాది పార్టీ, టిఎంసి తమ అభ్యర్థులుగా కలామ్, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పేర్లను ప్రతిపాదించిన విషయం విదితమే. గురువారం రాత్రి పాట్నా వచ్చిన కలామ్‌కు విమానాశ్రయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాగతం పలికారు.