సర్కారీ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలి


కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
పిల్లలు,టీచర్ల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి
విజయవాడ,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రపంచవ్యాప్తంగా మళ్లీ బడుల్లో సందడి మొదయ్యింది. అమెరికాలో సైతం మళ్లీ స్కూల్లు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటూనే స్కూళ్లు తెరవాలని మేధావులు కూడా సూచిస్తున్నారు. లేకుంటే పిల్లల్లో మానసిక ఆందోళనలు, బలహీనతలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎపిలో కూడా స్కూళ్లు తెరవడంతో పిల్లలు కూడా ఉత్సాహంగా వెళుతున్నారు. సిఎం
జగన్‌ వరుసగా సవిూక్షలు చేస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు. అలాగే అధికారులు కూడా అటు ఉద్యోగులను, ఇటు పిల్లలను ఆరోగ్యంగా ఉండేలా చర్యలకు ఉపక్రమించాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాతే బడులు తెరవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తున్నారు. బడి తెరిచేనాటికి ఉపాధ్యాయులతో పాటు, బోధనేతర సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్కడక్కడా కొందరికి వ్యయాక్సినేషన్‌ పూర్తి కాకున్నా దానిని పూర్తి చేఏ పనిలో ఉన్నారు. వ్యాక్సినేషన్‌ కానివారు ప్రతి జిల్లాలోనూ వందల మంది ఉన్నారు. విద్యార్థులకు సన్నిహితంగా మెలిగే అవకాశమున్న మధ్యాహ్నా భోజన సిబ్బందికీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. శానిటైజర్ల కొనుగోలుకు పాఠశాల నిర్వహణ నిధుల నుండి ఖర్చు చేయాలన్న సూచన మేరకు నిధులు కేటాయించాలి. అనేక పాఠశాలల్లో నిధులు లేవు. గత ఏడాది బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు చేయడానికీ హెచ్‌ఎంలు సిద్ధం కావడం లేదు. కరోనా తల్లితండ్రులను భయపెడుతున్నా..పిల్లలను ఇంటిలో ఉంచుకోలేక, బడికి పంపలేకా వారు ఆందోళనలో ఉన్నారు. అయినా ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో బడిబాట పట్టించారు. ఇప్పటి వరకు ఎలాంటి విఘ్నాలు లేకుండా బడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పలువురు ఉపాధ్యాయులు తమ నివాస ప్రాంతాల నుంచి బస్సుల్లోనూ, ఆటోల్లోనూ పాఠశాలలకు వచ్చి వెళ్తున్నారు. రాష్ట్రంలో నేటికీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోని వారు ఈ సమయంలో కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు పాఠాలు అర్థం కావడానికి ఉపాధ్యాయులు మాస్కులు తొలగించి పాఠాలు చెప్పాల్సి వస్తోంది. పాఠశాలల్లో కరోనా నివారణకు అవసరమైన నిధులు వెంటనే అందచేయాలి. ఉపాధ్యాయులందరికీ యుద్ధప్రాతిపాదికన రెండో డోసులు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాల్సి ఉంది. అయితే పలుచోట్ల తరగతి గదులను శానిటైజ్‌ చేయడం లేదు. విద్యార్థులే స్వయంగా పరిసరాలను శుభ్రం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గదికి 20 మంది మించి విద్యార్థులను కూర్చోబెట్టవద్దని ప్రభుత్వ నిబంధన చేసింది. ఉపాధ్యాయుల కొరత వల్ల 20 మందికిపైగా విద్యార్థులను ఒకే గదిలో ఉంచుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం తీసుకున్నచర్యలకు తోడు ఇప్పుడు చాలా అప్రమత్తత కూడా అవసరం. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.