సర్కారుకు ఇదే చివరి అవకాశం
తర్వాత తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు లాభముండదు
సంసద్‌తో ఢిల్లీ దద్దరిల్లాలి
స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరు కొనసాగుతుంది కోదండరామ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 (జనంసాక్షి) :’యూపీఏ సర్కారుకు ఇదే చివరి అవకాశం. తర్వాత తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు లాభముండదు.’ అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సంసద్‌యాత్ర ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. శనివారం సంసద్‌యాత్ర కోసం సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన ప్రత్యేక రైలు ఆదివారం ఉదయం హస్తినకు చేరుకుంది. ఢిల్లీ చేరుకోగానే సహచరులతో కలిసి జంతర్‌మంతర్‌కు వచ్చిన కోదండరామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను వంచించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. మే నెలలో తెలంగాణ వస్తుందన్న మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలపై నమ్మకం లేదన్నారు. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకే ఆయన అలా వ్యాఖ్యానిస్తున్నారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయన్నారు. మంత్రి పదవి ఇవ్వకముందు తెలంగాణ కోసం ఎన్నో చేస్తానన్న జానారెడ్డి పదవిలో కూర్చున్నాక మొత్తం మర్చిపోయారని ఆరోపించారు. ఎన్నోమార్లు తెలంగాణపై బూటకపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేయడం తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేయడమేనని అన్నారు. ఒకవేళ జానా చెప్పింది నిజమే అయితే ఆ మాటే అధిష్టానంతో చెప్పించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఇలా నెలల పేరు చెప్పుకొని కాలం గడపడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోని ద్రోహులను సంసద్ పోరు నుంచి వెలివేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చారని, ఇంకా వేచి చూసే ఓపికలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం ఇప్పుడు చివరి అంకానికి చేరుకుందని, రాష్ట్రంలోని సీపీఎం మినహా మిగతా పార్టీలన్నీ జై తెలంగాణ అనకుండా ఎన్నికల్లో పోటీ చేయలని పరిస్థితి ఉందంటే తెలంగాణవాదం ఎంత ప్రబలంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణపై ఇకనైనా సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. యూపీఏ సర్కార్ తన మాటను నిలబెట్టుకోకుంటే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌కో ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో నినాదంతో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న సత్యాగ్రహ దీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కేంద్రానికి తెలంగాణ సత్తా ఏమిటో మరోసారి చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ దేవిప్రసాద్, కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.