సర్కారు చేతిలో బందీనా?
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ (సీబీఐ) భారత అత్యున్నత దర్యాప్తు సంస్థ. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ సంస్థ స్వయం ప్రతిపత్తి కలది. కానీ ఇప్పటి వరకూ స్వయం ప్రతిపత్తితో నడుచుకున్న దాఖలాలు లేవు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి మద్దతుగా సీబీఐ వ్యవహరిస్తోందని అపవాదు ఉంది. ఆ అపవాదు నిజమేనని ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మంగళవారం స్వయంగా అంగీకరించారు. దేశంలోనే అతిపెద్ద బొగ్గు కుంభకోణం నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించంటే ముందే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), అటార్నీ జనరల్ (ఏజీ), బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ముందు ఉంచినట్లు ఆయన సుప్రీం కోర్టుకు నివేదించారు. అంతటితో ఆగలేదు. ‘సీబీఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాదు. మేం ప్రభుత్వంలో భాగమే. మేం ఎవరో బయటి వ్యక్తికి నివేదిక చూపించలేదు. స్వయానా దేశ న్యాయశాఖ మంత్రికే చూపించాం. దీనికి సంబంధించిన ఏ అంశమైనా నేను సుప్రీం కోర్టుకు తెలియజేస్తాను’ అని చిన్న పిల్లాడు మాట్లాడినట్టు మాట్లాడారు. ఆయన మాటలతో పెద్ద దుమారమే చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ ఏ స్థాయిలో బందీ అయిపోయిందో వివిధ రాజకీయ పక్షాలు గొంతెత్తి పేర్కొన్నాయి. అయితే సీబీఐ తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర స్వరంతో మండిపడింది. తమకు చూపకుండా న్యాయశాఖ మంత్రికి నివేదిక చూపాలి అని చట్టంలో ఉందా అని ప్రశ్నించింది. ముప్పేట దాడి మొదలు కావడంతో ఆత్మరక్షణలో పడ్డ సీబీఐ నష్ట నివారణ చర్యలకు దిగింది. రంజిత్ సిన్హా వ్యాఖ్యల ఉద్దేశ్యాన్ని వక్రీకరించారని చెప్పుకొచ్చింది. తాము ప్రభుత్వంలో భాగం అంటే ఒంటిరివాళ్లం కాదన్నట్టు చెప్పే ప్రయత్నమే రంజిత్ సిన్హా చేశారని సీబీఐ ప్రతినిధి ధారిని మిశ్రా మీడియాకు వివరించారు. మొత్తంగా బొగ్గు బ్లాకుల కేటాయింపులో జరిపిన నివేదిక ప్రభుత్వ వర్గాలు ముందే చేరిన వ్యవహారంలో అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ పీ రావల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. సుప్రీం కోర్టును సీబీఐ కావాలనే పక్కదారి పట్టించిందనే ఆరోపణలతో ఆయన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 1963 ఏప్రిల్ 1న డీపీ కోహ్లి డైరెక్టర్‌గా సీబీఐ పురుడు పోసుకుంది. దేశవ్యాప్తంగా నాలుగు రీజియన్లు, 52 శాఖల ద్వారా సేవలందిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో సంచలనం సృష్టించిన పలు కేసుల్లో సీబీఐ దర్యాప్తు కొనసాగించింది. ఇప్పుడో ఎన్నో కేసులను దర్యాప్తు చేస్తోంది. అయితే సీబీఐ దర్యాప్తు జరిపే ఎక్కువ కేసులు అధికార పార్టీతో రాజకీయంగా విభేదించే వారిపైనే ఉండటంతో సీబీఐ క్రెడిబులిటీపై అనేక అనుమానులున్నాయి. పలుమార్లు బాహాటంగానే ఆరోపణలు వినవచ్చాయి. వినవస్తున్నాయి కూడా. సీబీఐకి ప్రత్యేకంగా రాజకీయ ఉద్దేశాలు లేకున్నా అధికారంలో ఉన్నవారి ప్రభావానికి లోనుకాక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. సీబీఐని స్వతంత్ర సంస్థగా మార్చాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి వినీత్ నారాయణ్ తీర్పు వెలువరించి 15 ఏళ్లయినా ఇప్పటి వరకూ ఆ తీర్పు అమలుకు నోచుకోలేదు. అదే సమయంలో సీబీఐ దర్యాప్తు ప్రక్రియ ప్రహసంగా మారడం, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఏళ్ల తరబడి సాగిన విచారణ నిజాలు నిగ్గు తేల్చకపోవడంతో ప్రజలకు దానిపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇలాంటి తరుణంలో రంజిత్‌సిన్హా చేసిన వ్యాఖ్యలు మొత్తం దర్యాప్తు సంస్థ విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నాయి. బోఫోర్స్, హవాలా, ప్రియదర్శిని మతో హత్య కేసు, నితారి హత్యలు, దావూద్ ఇబ్రహీం కేసు, సిస్టర్ అభయ హత్యకేసు, సోహ్రాబుద్దిన్ కేసు, సంత్ సింగ్ చత్వాల్ కేసు, మలాంక వర్గీస్ హత్య కేసు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై చేసిన దర్యాప్తు సీబీఐ ప్రతిష్టకు మచ్చ తెచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు కుంభకోణంలో సీబీఐ వ్యవహార శైలిపై అనేక ఆరోపణలున్నాయి. వివిధ రాజకీయ పక్షాల నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీబీఐని పావుగా వాడుకుంటోందని ఆరోపణలున్నాయి. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఎన్నో కేసుల్లో సీబీఐ దర్యాప్తు చివరకు ఉసూరు మనిపించింది. ఇది అధికార పార్టీ చెప్పుచేతల్లో సీబీఐ ఉండటమే కారణమే ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది. తాజాగా సీబీఐపై ముసురుకుంటున్న ఆరోపణల పర్యవసానాలు ప్రజల్లో అనేక సందేహాలకు, గందరగోళానికి తావిస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు సంస్థగా అత్యున్నత స్థాయికి చేరాలంటే దానిపై ప్రభుత్వ అజమాయిషీ పోయి స్వయం ప్రతిపత్తి వచ్చి తీరాలి. ఇది పటిష్టమైన లోక్‌పాల్ చట్టం అమల్లోకి వస్తేనే సాధ్యం. ఇందుకు ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా ఉండదు. తమ వేలితో తమ కంటినే పొడుచుకునేందుకు దేశంలోని ఏ రాజకీయ పార్టీ సిద్ధపడదూ. ప్రజల్లో చైతన్యం వచ్చి పటిష్టమైన లోక్‌పాల్ కోసం, స్వయం నియంత్రణ, అధికారాలు ఉన్న సీబీఐ కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.