సర్కారు దవాఖానలో కలెక్టర్ భార్య ప్రసవం
` మంత్రి హరీశ్‌రావు అభినందనలు
భద్రాద్రి కొత్తగూడెం,నవంబరు 10(జనంసాక్షి): ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల వైద్యసేవలు మెరుగవగా.. ప్రజల్లో మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ తన సతీమణిని చేర్పించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇలా జిల్లా కలెక్టర్ ఆదర్శంగా నిలిచారు. జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే వైద్యం చేయించుకునేందుకు ఉత్సాంగా ముందుకొస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకు నిదర్శనం కలెక్టర్ దంపతులేనని మంత్రి ప్రశంసించారు.