సర్కార్‌ మత్తు వదలకపోతే

అసెంబ్లీ ముట్టడిస్తం
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
కోదండరామ్‌
హైదరాబాద్‌, మే 1 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం మత్తు వదలకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. బుధవారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా త్వరలోనే చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఆయన చెప్పారు. తాము నిర్వహించిన సంసద్‌ యాత్రతో తెలంగాణ ఉద్యమంలో ఊపురావడమే కాక ప్రజల్లో మరింత ఉత్సాహం వచ్చిందని చెప్పారు. ఈ యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ యాత్రలో తమకు పలు రాజకీయ పార్టీల మద్దతు లభించిందన్నారు. సీమాంధ్ర నాయకులు వస్తే ఢిల్లీలో గేట్లు తెరుస్తారని, తెలంగాణవాదులు వస్తే బారికేడ్లు అడ్డుపెడుతున్నారని ఆయన విమర్శించారు. బారికేడ్లు, బందూకులు తెలంగాణ ఉద్యమాన్ని ఆపజాలవని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిచి తెలంగాణ ప్రకటించాలన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో కూడా పెద్దఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణ ప్రాంత వనరులను ఆంధ్ర ప్రాంతానికి తరలించడం అన్యాయమని కోదండరాం అన్నారు. బయ్యారం గనుల తరలింపుపై జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బయ్యారంలోనే ఉక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ& చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా మాట్లాడడం సమంజసం కాదన్నారు.