సర్టిఫికెట్ కోసం వెళితే తహసీల్దార్ వేధింపులు
– కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన యువతి
నిర్మల్, మే8(జనం సాక్షి) : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ తహసీల్దార్ నరేందర్ వేధిస్తున్నారంటూ రాజా సింధు అనే యువతి రెవిన్యూ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగానికి ఎంపిక అయ్యాయని, బీసీ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం వెళితే.. ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ ఇవ్వకుండా తహసీల్దార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ రెవిన్యూ కార్యాలయం ముందు నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా యువతి రాజా సింధు విూడియాతో మాట్లాడుతూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ 9న (రేపు) హైదరాబాద్‌లో ఉందని అన్నారు. బీసీ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అన్ని పార్మాలిటీస్ పూర్తి చేసినా తహసీల్దార్ స్పందించడం లేదని సర్టిఫికెట్ ఇవ్వడం లేదని, పీఆర్వో, ఆర్‌ఐ సంతకాలు చేసినా ఆయన సంతకం చేయలేదని, తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె
ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం తన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగకపోతే దానికి తహసీల్దారే బాధ్యత వహించాలని, ఇది తన జీవితానికి సంబంధించిన విషయమని ఆమె పేర్కొంది. ఉద్యోగం రాకుండా చేస్తున్నారని, గత నాలుగు రోజులుగా తనను వేధిస్తున్నారని రాజా సింధు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఏమైనా అయితే దానికి తహసీల్దార్‌దే బాధ్యత అని ఆమె చెప్పింది.