సర్వేలు నమ్మొద్దు కాంగ్రెస్‌దే విజయం

జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణ తేల్చాలని డిమాండ్‌
అసంతృప్తులు, నిరసనల మధ్య ముగిసిన కాంగ్రెస్‌ సదస్సు
హైదరాబాద్‌, మే22 (జనంసాక్షి) :
సర్వేలు నమ్మి అధైర్యపడొద్దు. 2014లో కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల ముభూర్తంపై సిఎం స్పష్టత ఇచ్చారు.  జూన్‌ మూడు లేదా నాలుగో వారంలో స్థానిక ఎన్నికలు, ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  బుధవారం నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల అంశం కోర్టులో ఉన్నందున స్థానిక ఎన్నికల్లో జాప్యం జరిగిందన్నారు. బీసీలకు ప్రాధాన్యం తగ్గకూడదనే కోర్టులో పోరాడామని చెప్పారు. ఎన్నికలకు భయపడి స్థానిక సంస్థల ఎన్నికలను ఆపలేదన్నారు. బిసిలకు అన్యాయం జరుగుతోందని సుప్రీం కోర్టుకు వెళ్లి ఆ తీర్పు కోసం ఆగామన్నారు. జూన్‌, ఆగస్టుల్లో నిర్వహించి తీరుతామన్నారు. గత స్థానికంలో కాంగ్రెసు విజయ దుందుభి మోగించిందన్నారు. చాలా స్థానాల్లో పోటీ పోటీ ఉన్నప్పటికీ పార్టీ టిక్కెట్‌ ఇచ్చిన వారి గెలుపు కోసం అందరు కృషి చేయాలని కోరారు. ఎక్కడైనా విభేదాలు సహజమే అన్నారు. తల్లిదండ్రులు, అక్కా చెల్లెల్లు చివరకు లవర్స్‌ మధ్య కూడా విభేదాలుంటాయని, పార్టీలో కూడా సహజమే అన్నారు. కష్టపడి పనిచేస్తే ఎవరికైనా పదవులు వస్తాయని, కార్యకర్తలు లేకుండా ఎవరూ ఎమ్మెల్యే కాలేరని అన్నారు. పార్టీ గుర్తించి టికెట్‌ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ పార్టీకి కృతజ్ఞతగా ఉండాలని నేతలకు సూచించారు. పార్టీలో  భేదాభిప్రాయాలు సహజమని, వాటిని బజార్లో పెట్టకూడదని సీఎం చెప్పారు. దాదాపు 2.58 లక్షల స్థానాలకు త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, పార్టీని బలోపేతం చేయకపోతే ఇబ్బంది తలెత్తుతుందన్నారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని , ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వ్యక్తిగతం కావని, పార్టీవేనని సీఎం చెప్పారు. దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ ద్వారానే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడనే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు గుర్తుంచుకోవాలని అన్నారు. కొత్తగా వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీ పథకాలను తమ పార్టీ జెండాలో పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఎంత దూరం నడిచినా ఒరిగేదేమీ లేదన్నారు. ఆయన ఎంత నడిచారో అంతకంటే ఎక్కువే ఆ పార్టీ నష్టపోతుందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన జగన్‌ ప్రస్తుతం జైలులో ఉన్నారని, ఆయన సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని, అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మన పరిస్థితి, మన రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరూ ఆలోచించాలన్నారు. కాంగ్రెసు పార్టీ రెండు రూపాయల బియ్యాన్ని రూపాయికి, పావలా వడ్డీని సున్నా వడ్డీకి చేసిందని, జగన్‌ పార్టీ జెండాలోని ఆ పథకాలను మార్చుతారా చెప్పాలని ప్రశ్నించారు. మన పథకాలు వారి జెండాలో పెట్టుకోవడం విడ్డూరమన్నారు. కాంగ్రెసు పార్టీ తమను గుర్తించి టిక్కెట్‌ ఇచ్చిందని, కార్యకర్తల సహకారంతో తాము గెలిచామన్నారు. కార్యకర్తలు లేనిదే ఎవరు ఎమ్మేల్యే కారన్నారు. కార్యకర్తలు గెలిపించినందువల్లే తాము ఈ వేదికపై కూర్చున్నామన్నారు. కాంగ్రెసులో కష్టపడి పని చేస్తే ఆలస్యంగానైనా తలుపు తట్టి పదవులు వస్తాయన్నారు. ఎంతో కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. లేదంటే ఓటమి తప్పదన్నారు. నాయకులు అందర్నీ కలుపుకుపోవాలన్నారు. పదివేల ఓట్లు పోతే ఇరవై వేల ఓట్లు సమీకరించేందుకు ప్రోగ్రామ్స్‌ ఉన్నాయన్నారు. కాంగ్రెసులో అందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందుకే ఉన్నవారు వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. త్వరలో పన్నెండు లక్షల రేషన్‌ కార్డులిస్తామన్నారు.
అసంతృప్తులు.. ఆందోళనలు.. నిరసనలు..
కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కనిపించిన దృశ్యాలివి. తెలంగాణ డిమాండ్‌, నామినేటెడ్‌ పదవుల భర్తీ, సమన్వయ లేమి తదితర అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు మాత్రం పదువుల్లో ఉంటారు కింది స్థాయి నేతలకు, కార్యకర్తలకు మాత్రం న్యాయం చేయరా? వారికి పదవులు ఇవ్వరా? అంటూ నిలదీశారు. రెండేళ్లు గడిచినా నామినేటెడ్‌ పదువులు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. కింది స్థాయి కార్యకర్తలను ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా నిలదీశారు. పార్టీ కోసం తాము జైళ్లకు వెళ్తున్నామని, నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కష్టకాలంలో ఉన్నప్పుడే పార్టీకి, నేతలకు కార్యకర్తలు గుర్తుకు వస్తారా? అని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకే విలువిస్తారు కానీ, కార్యకర్తలను పట్టించుకోరా? అని నిలదీశారు. రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అడుక్కుతినే పరిస్థితిలో ఉన్నారని, ముష్టివాళ్లలా బతుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయకపోతే, నాయకులకు గుర్తింపు ఇవ్వకపోతే ఇతర పార్టీల వైపు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. రాష్ట్ర నాయకత్వం ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం తప్పదని స్పష్టం చేశారు. మండల, బ్లాక్‌ నాయకుల అభిప్రాయాలతో పలువురు నేతలు కూడా గొంతు కలిపారు. మంత్రి  దానం నాగేందర్‌, సీనియర్‌ నేతలు వీహెచ్‌, పొన్నం ప్రభాకర్‌ సహా చాలా మంది నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే, కార్యకర్తలు వేరే పార్టీల వైపు వెళ్లిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
బుధవారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి, మంత్రులు దానం నాగేందర్‌, ఆనం రాంనారాయణరెడ్డి, జానారెడ్డి, మహీధర్‌రెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, ఎంపీలు వీహెచ్‌, పొన్నం ప్రభాకర్‌, జిల్లాల అధ్యక్షులు, మండల, బ్లాక్‌ లెవెల్‌ అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందే వివాదం చెలరేగింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చిరంజీవి ఫొటో లేకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్య నేత, కేంద్ర మంత్రి అయిన చిరంజీవి ఫొటో పెట్టకపోవడంపై మండిపడ్డారు. మంత్రి దానం నాగేందర్‌ జోక్యం చేసుకొని వారికి సర్దిచెప్పారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని హావిూ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది. ఇక సమావేశం ప్రారంభమైనప్పటి నుంచీ ముగిసే వరకూ తెలంగాణ నినాదం మార్మోగింది. జై తెలంగాణ అంటూ పలువురు నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. డిసెంబర్‌ 9నాటి ప్రకటనకు కట్టుబడి తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు చెందిన నేతలంతా తమ ప్రసంగాల్లో ప్రత్యేక రాష్ట్ర ప్రస్తావనను తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటు చేస్తేనే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు మనుగడ సాధ్యమని, లేకుంటే కష్టమేనని తేల్చి చెప్పారు. మంత్రి జానారెడ్డి, వీహెచ్‌, పొన్నం ప్రభాకర్‌ సహా తెలంగాణ ప్రాంత జిల్లాల అధ్యక్షులు ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. మాట నిలబెట్టుకుంటేనే తెలంగాణలో పార్టీ అస్తిత్వం కొనసాగుతుందున్నారు. డిసెంబర్‌ 9న పార్లమెంట్‌లో తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుద్దమళ్ల హరికృష్ణ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్టాన్న్రి ప్రకటిస్తే తప్పా కాంగ్రెస్‌కు తెలంగాణలో పుట్టగతులు ఉండవని నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ తేల్చిచెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని మంత్రి దానం నాగేందర్‌.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణల సమక్షంలోనే స్పష్టం చేశారు. నామినేటెడ్‌ పోస్టుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారని. వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను పట్టించుకోవడం లేదని, తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని వీహెచ్‌ హెచ్చరించారు. కింది స్థాయి నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల వైపు వెళ్లిపోయే ప్రమాదముందన్నారు. పార్టీ నాయకత్వంపై ప్రకాశం జిల్లాకు చెందిన ఓ నాయకుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం తాము జైళ్లకు వెళ్తున్నామని, నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కష్టకాంలో ఉన్నప్పుడే పార్టీకి, నేతలకు కార్యకర్తలు గుర్తుకు వస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అడుక్కుతినే పరిస్థితిలో ఉన్నారని, ముష్టివాళ్లలా బతుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకే విలువిస్తారు కానీ, కార్యకర్తలను పట్టించుకోరా? అని నిలదీశారు. మరో నేత కూడా ఇలాగే మాట్లాతుండగా, ఆయన మైక్‌ కట్‌ చేయడం గమనార్హం. గతంలో చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమం పని చేస్తే.. ఇప్పుడున్న పాలకులు పెళ్లికొడుకుల్లా భోగాలు అనుభవిస్తున్నారని కామారెడ్డి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుమల్‌గౌడ్‌ విమర్శించారు.