సలాఖ్ పూర్‌లో అరుదైన ఆత్మాహుతి శిల్పం లభ్యం
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు
మద్దూరు జూన్ 22 (జనంసాక్షి): మద్దూరు మండలంలోని సలాక్‌పూర్ గ్రామంలో అరుదైన వీరగల్లు ఆత్మాహుతి శిల్పం లభ్యమైంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వాటిని గుర్తించారు. నల్లరాతితో చెక్కిన ఈ శిల్పంలో వీరుడు అర్ధ పద్మాసన స్థితిలో కూర్చొని ఉన్నాడు. మణిపట్ట కిరీటం, చెవులకు కుండలాలు, కంఠాన రుద్రాక్షమాల, భుజకిరీటాలు, బొడ్లో చురకత్తి, వస్త్రమేఖల, అర్ధ్థోరుకం, కాళ్లకు ఐదు వరుసల కడియాలు ఉన్నాయి. వీరుడి కుడిచేతిలో ఖడ్గం ధరించి ఉండగా ఎడమచేయి విరిగిపోయి ఉన్నది. ఈ శిల్పానికి కొద్దిదూరంలోనే గుర్రం అర్ధ శిల్పం ఉన్నది. ఆత్మార్పణ చేసుకోవడానికి ముందు వీరుడు ఆ గుర్రాన్ని నిలిపిన చోటునుంచి దూరంగా వచ్చి ఇష్టదైవ ప్రార్థన (ప్రేయర్ బిఫోర్ డెత్)కు కూర్చున్నట్టు ఆధారాలను చూస్తే స్పష్టమవుతుందని స్థపతి ప్రముఖ చరిత్రకారుడు శివనాగిరెడ్డి తెలిపారు. ఈ వీరుని శిల్పం రాష్ట్రకూటుల కాలం నాటి శైలిని కలిగి ఉన్నదని నిర్ధారించారు. వీరగల్లులలో ఆత్మార్పణ వీరగల్లులు ప్రత్యేకమని, శైవమతంలోని వీరభక్తికి నిదర్శనాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. దేవుడికి తమ ప్రాణాలను వివిధ పద్ధతుల్లో అర్పించిన వారిని ఆత్మార్పణ వీరులు అంటారన్నారు. పాటిగడ్డమీద శాతవాహనకాలం నాటి కుండ పెంకులు, చిత్తుడుబిల్ల, డాబర్, సన్నముక్కు గొట్టాలు, నూరుడురాళ్లు సైతం లభించాయని క్షేత్రపరిశోధనకు వెళ్లిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీర్, కిరణ్ తెలిపారు.