సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్యాంకర్ బోల్తా

close

కాజా(జ‌నం సాక్షి ): గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్‌గేట్ వద్ద సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది. కాకినాడ నుంచి చెన్నై వెళ్తున్న ట్యాంకర్ కాజా వద్దకు చేరుకున్న సమయంలో బ్రేకులు విఫలమవడంతో డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని రోడ్డు చివరకు తీసుకొచ్చి విద్యుత్ స్థంభానికి ఢీ కొట్టాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్ బోల్తా పడిన ప్రాంతంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ లీకవడంతో పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి 150 మీటర్ల దూరంలో వాహనాలను మళ్లించారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ వాహనాన్ని బయటకు తీసేందుకు రెండు క్రేన్లను తీసుకువచ్చారు. వాహనాన్ని తీస్తున్న సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా మూడు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలంలో ఉంచారు. ఎన్డీఆర్‌‌ఎఫ్‌ కమాండెంట్ జాహిద్ ఖాన్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.