సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు
ఉపాధి కల్పిస్తున్న చేపపిల్లల పెంపకం
భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్20(జనంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం పేరుతో భారీ రాయితీలతో పలు యూనిట్లను మంజూరు చేసింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి మత్స్యకారుడు సద్వినియోగం చేసుకుంటున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ప్రతీ పల్లెలో చిన్న నీటి వనరులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. సాగునీరు అందించడంతోపాటు చేపల అభివృద్ధికి కూడా వినియోగించాలని రెండేళ్లుగా ప్రతీ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేపలు వదిలే కార్యక్రమం చేపట్టింది. ప్రాథమిక మత్స్య సహకార, మహిళా మత్స్య సహకార, మత్స్యకార మార్కెటింగ్ సహకార సంఘాల్లో నమోదైన సభ్యులు, లేదా సభ్యుల గ్రూపులు, జిల్లా మత్స్య సహకార సంఘాలు ప్రయోజనం పొందేలా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం రూపొందించారు. 18ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన లబ్ధిదారులు యూనిట్ విలువలో లబ్ధిదారుని వాటా చెల్లించాల్సి ఉంటుంది. సంఘాల పరంగా లబ్ధిపొందాలనుకునే వారు ఆడిట్ నివేదిక అందజేయాల్సి ఉంటుంది. కొత్తగా రిజిస్టేష్రన్ చేసుకునే సంఘాలకైతే ఈ నిబంధన వర్తించదని బుచ్చిబాబు వివరించారు. పెరిగిన చేపలను పట్టడం, విక్రయించుకొనేందుకు మత్స్యశాఖ సొసైటీలు వనరులు లేక వెనుకబడి ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పరిణామంతో మత్స్యశాఖ సొసైటీల్లో ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి.