సహకార సంఘాల ఎన్నికలలో గట్టి బందోబస్తు
నిజామాబాద్, జనవరి 31 (): మొదటి విడత సహకార సంఘాల ఎన్నికలు గురువారం జిల్లాలో ప్రశాంతగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించడంతో పోలీంగ్ 85శాతం జరిగింది. జిల్లాలో 142 సహకార సంఘాలు ఉండగా,మొదటి విడతలో 74 సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి.వీటిలో పది సహకార సంఘాలు కామారెడ్డి డివిజన్‌లో2, నిజామాబాద్ డివిజన్‌లో 2, బోధన్ డివిజన్‌లో 6 సహకార సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 64 సంఘాలకు గాను రెండు సంఘాలకు కోర్డు స్టే విధించడం, మరో సంఘానికి రెండవ విడతలో ఎన్నిక చేయాలని నిర్ణయిండంతో గురువారం 61 సంఘాలోని మొత్తం 561 డైరెక్టర్ల స్థానాలకు 1824 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. గురువారం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరిగింది.మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్న భోజన అనంతరం ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు.సాయంత్రం 4 గంటల వరకు సంఘంలోని సగం డైరెక్టర్ల ఎన్నికను ప్రకటించడంతో గ్రామాల్లో పండుగ వాతవరణం నెలకొంది. కలెక్టర్ క్రిస్టినా ఉదయం 7గంటల 30 నిమిషాల నుంచి మాక్లూర్,నందిపేట, నవీపేట మండలాలోని 8 సహాకార సంఘాలను సందర్శించి ఎన్నికల పనితీరును స్వయంగా పరిశీలించారు. బినోల, నాగేపూర్, ఐలాపూర్ సంఘాల్లో ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌ను సరిచేసి అధికారులకు పలు సూచనలు చేసారు. ఎన్నికల సంఘం గుర్తించిన ఏదేని గుర్తింపు కార్డు ఉంటేనే ఓటింగ్‌కు అనుమతినివ్వాలని ఆదేశించారు. డైరెక్టర్లుగా ఎన్నికైన అభ్యర్థులు మరుసటి రోజు చైర్మన్‌ను, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారని జిల్లా సహకార అధికారులు తెలిపారు.