సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 30 (): ఈనెల 31న జిల్లాలోని 61 సహకార సంఘాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నందున స్థానిక ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి  కేంద్రాన్ని కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌.చొంగ్థు బుధవారం నాడు పరిశీలించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సరిగా చేరే విధంగా సరిచూసుకోవాలని ఎటువంటి ఇబ్బందులు తావులేకుండా,ప్రశాంతంగా నిర్వహించాలని,  అన్ని చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్లకు ఓటర్ల జాబితాలో పేరున్న ఓటర్లను మాత్రమే అనుమతించాలని, ఓటు హక్కులేని వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్నారు.  పోలింగ్‌ బూతులోపల ప్రిసైడింగు అధికారి నిర్ణయమే ఫైనల్‌ అని అందులో జోక్యం చేసుకోవద్దన్నారు. జిల్లాలో 142 సహకార సంఘాలకుగాను 31న నిజామాబాద్‌ సబ్‌ డివిజన్‌లో 23, బోధన్‌ సబ్‌ డివిజన్‌లో 24, కామారెడ్డి సబ్‌ డివిజన్‌లో 17 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయని, మరో 10 సంగాలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీహరి, అదనపు జెసి శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.