సాగర్‌వద్ద ఆంధ్ర పోలీసుల దౌర్జన్యం
నల్లగొండ,ఫిబ్రవరి13(జనంసాక్షి): నాగార్జున సాగర్ డామ్ వద్ద మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. నీటి విడుదలలో ఏర్పడ్డ ప్రతిష్టంభన ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ అధికారులు సాగర్ కుడికాలువ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర అధికారులు పేర్కొంటున్నారు. డ్యామ్ సరిహద్దు విషయంలో ఇరు రాషాలె పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకవైపు ఇరు రాష్టాల్ర అదికారులు చర్చలు జరుపుతుండగా, మరో వైపు పోలీసులు కూడా ఇరువైపులా మొహరించడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందన్న సంకేతాలు పంపుతుంది. నాగార్జున సాగర్ వద్ద నుంచి ఏడువేల క్యూసెక్కుల నీరు ఇవ్వాలని ఎపి డిమాండ్ చేస్తోంది. అయితే తాము నీటి విడుదల ఆపలేదని తెలంగాణ అంటోంది.కాగా నీరు అందడం లేదని ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. అద్దంకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ సాగర్ నీరు ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయని అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే అవసరమైతే గేట్లు పగలకొట్టి అయినా నీరు ఇవ్వాలని రవికుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో మరింత రెచ్చగొట్టడం సరికాదు. ఇదిలావుంటే నాగార్జున సాగర్ డ్యాం వద్ద జలజగడం మరింత రాజుకుంది. తెలంగాణ అధికారులు సాగర్ డ్యాం కుడి గట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు గంట వ్యవధిలోగా స్విచ్ రూమ్ తాళాలు ఇవ్వాలని, లేదంటే స్విచ్ రూమ్ తలుపులు పగులగొట్టి తెరవాల్సి వస్తోందని తెలంగాణ అధికారులకు లేఖ రాశారు. అయినప్పటికీ తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ అధికారులు మాచర్ల డీఎస్పీ, గురజాల ఆర్డీవో, కుడికాల్వ డీఈ ఆధ్వర్యంలో కుడిగట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్ తలుపులు పగలగొట్టారు.