సాగర్‌ కింద పంటలను కాపాడాలి

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి): జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరిధిలో ఉన్న పంటలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో చర్య తీసుకోవాలని రెండో జోన్‌కు నీటిని వెంటనే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సాగర్‌ ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మిరప, వరి తదితర పంటలను రైతులు సాగుచేశారన్నారు. ఇవి చివరిదశలో ఉన్నాయని, నీళ్లులేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటిని విడుదల చేసి పంటను కాపాడాలని, లేనిపక్షంలో రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. ఈ మేరకు సీపీఎం ప్రతినిధి బృందం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించిందని చెప్పారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు సాగర్‌ నీటిని విడుదల చేయాలని కోరుతూ కొణిజర్ల, చింతకాని, వైరా మండలాలకు చెందిన రైతులు కూడా ఆందోళన నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీటిని నిలిపివేయడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటలకు నీళ్లివ్వాలని, దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు.