సాగర్‌ సమస్యపై చర్చలకు సిద్ధం

4

తెలంగాణ సీఎంకు ఏపీ సీఎం ఫోన్‌

నేడు గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో చర్చలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జనంసాక్షి):  నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తతలు తగ్గించటానికి, సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసీఆర్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. నాగార్జునసాగర్‌ వద్ద పరిస్థితిని చెప్పారు. దీనికి స్పందించిన కేసీఆర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుపకోవటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. నాగార్జునసాగర్‌ వద్ద తమ పోలీసులను వెంటనే ఉపసంహరించుకుంటామని బాబుకు హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోవలసిన అవసరం ఉందని , సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా కేసీఆర్‌ సూచించారు. శనివారం ఉదయం సమావేశమవుదామని ప్రతిపాదించారు. దీనికి బాబు కూడా అంగీకారం తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నాగార్జునసాగర్‌ వద్ద పరిస్థితిని , వివాదానికి దారి తీసిన పరిస్థితులను, చంద్రబాబుతో జరిపిన సంభాషణల సారాంశాన్ని వివరించారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లోనే చర్చించుకుందామనే ప్రతిపాదనను కూడా గవర్నర్‌కు చెప్పగా ఆయన అంగీకరించారు. శనివారం ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో సమావేశానికి గవర్నర్‌ ఏర్పాటుచేశారు. సాగర్‌ వద్ద మోహరింఛిన తెలంగాణ బలగాలు సంయమనం పాటించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తాజా పరిస్థితులపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్‌రావుతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.