సానియా.. ఆ యాడ్‌ నుంచి తప్పుకోండి

– ప్రజలను తప్పుదోవ పెట్టించేదిలా ఉంది
– సానియాను కోరిన సీఎస్‌ఈ
న్యూఢిల్లీ, మే22(జ‌నం సాక్షి ) : ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఓ పౌల్టీ అడ్వర్‌టైజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని పబ్లిగ్గా చెప్పాలని టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జాను సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) కోరింది. ఈయాడ్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నదని అడ్వర్‌టైజ్‌మెంట్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా తేల్చినట్లు సీఎస్‌ఈ వెల్లడించింది. సానియా విూర్జా నటించిన ఆ యాడ్‌ వాస్తవాలను తప్పుదోవ పట్టించేలా, అతిశయోక్తి కలిగించేలా, అస్పష్టంగా ఉన్నదని సీఎస్‌ఈ చెప్పింది. గతంలోనూ ఈ యాడ్‌కు దూరంగా ఉండాలని ఈ సంస్థ సానియాను కోరింది. గతంలోనే సానియాకు ఓ లేఖ రాశాం. పౌల్టీ రంగంలో యాంటీ బయాటిక్స్‌ని దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని ఆమెకు వివరించామన్నారు. ఓ బాధ్యతాయుత రోల్‌ మోడల్‌గా ఇలాంటి యాడ్స్‌కు దూరంగా ఉండాలని సూచించాము. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం అని సీఎస్‌ఈలో సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా ఉన్న అమిత్‌ ఖురానా చెప్పారు. తాము యాంటీ బయాటిక్స్‌ను దుర్వినియోగం చేయడం లేదని ఆ యాడ్‌ చెప్పడం అబద్ధమని సీఎస్‌ఈ స్పష్టంచేసింది. 2014లో జరిపిన పరీక్షల్లో చికెన్‌లో యాంటీ బయాటిక్స్‌ అవశేషాలను సీఎస్‌ఈ గుర్తించింది. ఈ యాడ్‌ను మార్చడమో పూర్తిగా తొలగించడమో చేయాలని అడ్వర్‌టైజ్‌మెంట్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ఆలిండియా పౌల్టీ డెవలప్‌మెంట్‌ అండ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను ఆదేశించింది.