సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం: కెఇ

కర్నూలు,జూలై4(జ‌నం సాక్షి ): మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణను సామాజిక బాధ్యతగాస్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వనం-మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఇది ప్రజల కార్యక్రమమని అన్నారు. రానున్న తరాలుమనలను తిట్టుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం చురకుగా చేపడతామని అన్నారు. ఇందులో విద్యార్థులు,యువత చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణహిత కార్యక్రమాలపై స్పృహను పెంపొందించి ఇంటర్మీడియట్‌ వరకు మొక్కలు నాటి వాటికి సొంత పేర్లు పెట్టుకొని వాటిని సంరక్షించేలా విద్యార్థులను బాధ్యులను చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలను లక్ష్యంగా పెట్టుకోగా, ప్రతి ఒక్కరూ నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కేఈ చెప్పారు. ఈసారి దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఉద్యానవన మొక్కలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, చెరువు గట్లపై అనుకూలతను బట్టి మొక్కలు నాటేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుభకార్యాలు, జన్మదినాలను పురస్కరించుకుని ప్రతిఒక్కరు మొక్కలు నాటడాన్ని ఒక సంప్రదాయంగా పాటించాలని కోరారు. అనేక కారణాల మూలంగా చెట్లు నరికివేతకు గురయ్యాయని, వాటిని భర్తీ చేయాలంటే విరివిగా మొక్కలను పెంచాలన్నారు. అన్నివర్గాల ప్రజలు మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెట్లు లేకనే వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వేసవి తాపం పెరిగిపోయిందని, నష్ట నివారణకు మొక్కల పెంపకమే సరైన పరిష్కారమన్నారు.

——