సామాజిక బాధ్యతలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుంది –
బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి”
శేరిలింగంపల్లి, జూలై 06( జనంసాక్షి): సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యత నిర్వహణ విషయంలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు, బిజెపి సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈమేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి బిజెపి సీనియర్ నేతలు ఎం. బిక్షపతి యాదవ్, ఎం. రవికుమార్ యాదవ్ తోకలిసి విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 56 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండా, బిక్షపతి యాదవ్ తదితరులు మాట్లాడుతూ సందయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ప్రతి యేటా ప్రభుత్వ పాఠశాలల విద్యార్దిని,విద్యార్ధులకు ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. సమాజసేవ చేయడానికి యువత రాజకీయాల్లోకి రావాలని, క్రియాశీల రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలని వారు సూచించారు. విద్యా సంవత్సర ప్రారంభంలో ప్రతీసంవత్సరం ఉచితంగా నోటుబుక్‌లు పంపిణీచేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కొరకు సహకరిస్తున్న రవికుమార్ యాదవ్‌ను కొండా ప్రత్యేకంగా అభినందించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఎం. బిక్షపతియాదవ్ లాంటి మంచి రాజకీయనేతను అందించిన ఘనత లింగంపల్లి పాఠశాలకు దక్కిందన్నారు. సందయ్య ట్రస్ట్ ద్వారా పేద వారికి చాలాకాలంగా ఉచిత విద్య, వైద్యానికి సాయం అందిస్తుండడం అందరికీ ఆదర్శనీయమని కొండా తెలిపారు. టీచర్లు కోపంతోచెప్పినా.. బుజ్జగించి చెప్పినా విద్యార్థుల మంచికోసమేనని అన్నారు. ప్రతీరంగంలో రాణించినవారంతా అంతకుముందు చదువులో మంచి ప్రతిభను కనబర్చినవారే అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా విద్యార్ధులను చదువుకు దూరంచేస్తుందని ఆరోపించారు.
కష్టపడి చదివితే రానున్న జీవితంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారు సూచించారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రవి కుమార్ యాద్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ఎం. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా శేరిలింగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లింగంపల్లి పాఠశాలతో పాటు నియోజకవర్గంలోని 70 పాఠశాలల్లో ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఈసారి కూడా ఉచితంగా స్టడీ మెటిరీయల్ అందిస్తామని హామీ ఇచ్చారు. పిల్లలు తమ విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్త్వం అలవరచుకొని నాయకత్వ లక్షణాలను పెంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమయిన సమాజం నిర్మించటం లో నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా పాలుపంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా లింగంపల్లి పాఠశాలలో 10 వ తరగతిలో ఉత్తమప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తదనతరం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా రవికుమార్ యాదవ్ గారు విద్యార్ధులతో కలిసి పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి పటేల్, సోమదాస్, గంగాధర్ రెడ్డి, నవతా రెడ్డి, కంచర్ల ఎల్లేష్, సింధు రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, నాగుల్ గౌడ్, వసంత్ కుమార్, ఆంజనేయులు సాగర్, పద్మ, రేణుక, ఆకుల లక్ష్మణ్ , రమేష్, పృథ్వి , గణేష్ , తదితరులు పాల్గొన్నారు