సామాజిక రక్షణ పథకాలపై అవగాహన కార్యక్రమాలు

 

కేవలం 20 రూపాయలతో 2 లక్షల ప్రమాద బీమా

బోనకల్ :బోనకల్ మండల కేంద్రంలోని ఎస్బిఐ ఖాతాదారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ ఖాతాదారులకు , ఆటో డ్రైవర్లకు ,పంచాయతీ కార్మికులకు అలాగే వివిధ వర్గాల ప్రజలకు సామాజిక రక్షణ పథకాల గురించి బేసిక్స్ సబ్ కె సిఆర్ఓ బండి జవహర్ లాల్ ఖాతాదారులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 మంది ఖాతాదారులకు బీమా చేయించి పత్రాలు అందజేయడం జరిగింది. కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమా పొందవచ్చని వారు తెలిపారు. అదేవిధంగా బోనకల్ సర్పంచ్ సైదా నాయక్ ను కలిసి ఈ యొక్క సామాజిక పథకాల గురించి వివరించి ప్రజలను చైతన్య పరచవలసిందిగా కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2015 బ‌డ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మూడు సామాజిక భద్రతా పథకాలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ,అటల్ పెన్షన్ యోజన పథకాలు ప్రకటించారు. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది ప్రమాద బీమా పథ‌కం. పాల‌సీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవ‌శాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా ఈ పథ‌కం అండ‌గా ఉంటుంది. దీని కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి పున‌రుద్ధరించుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వ‌య‌సున్న వ్యక్తి ప్రధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న‌లో చేరొచ్చు. ఇందుకోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, అప్పుడు మీరు ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరాల్సి ఉంటుంది.
ఈ పథ‌కానికి వ‌ర్తించే ప్రీమియంను ఇటీవ‌లే ప్రభుత్వం పెంచింది. ఏడాదికి రూ. 12 నుంచి రూ.20కి పెంచింది. దీంతో పాటు ప్రధాన మంత్రి జీవ‌న జ్యోతి బీమా యోజ‌న ప్రీమియంను కూడా పెంచారు. ఇంత‌కు ముందు పీఎంజేజేబీవై ప్రీమియం రూ.330 ఉంటే ఇప్పుడు దాన్ని రూ.436కి పెంచింది. ఈ పథకానికి 2 లక్షల జీవిత బీమా ఉంటుంది. 18 నుండి 50 సంవత్సరాల లోపు వారికి ఈ పాలసీ ఉంటుంది. అంటే రెండు ప‌థ‌కాల‌కు క‌లిపి రోజుకి రూ.1.25 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికిగాను 4 లక్షల బీమా ఉంటుంది. చెల్లింపుల‌కు ఆటో డెబిట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ పద్ధతిలో కట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ జూన్ 1 తర్వాత ఆటో డెబిట్ పద్ధతి ద్వారా మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లయితే ఆ తేదీ నుంచి బీమా ప‌థ‌కం అమ‌లు చేస్తారు. ఎవరైనా చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ఉన్నా ఒక్క బ్యాంక్‌ ద్వారా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ సందర్భంగా సర్పంచ్ సైదా నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ,ఇంకా వీటి గురించి పూర్తి వివరాలకు దగ్గరలోని ఎస్బిఐ సేవా కేంద్రంలో సంప్రదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనకల్ సర్పంచ్ సైదా నాయక్ , సబ్ కే సి ఆర్ ఓ జవహర్ లాల్, ఎస్బిఐ సేవ కేంద్రం నిర్వాహకులు యార్లగడ్డ శ్రీనివాసరావు ,మురళి ,గోపి, పంచాయతీ సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.