సామాన్యునికి అవమానం
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అందని రిపబ్లిక్‌డే ఆహ్వానం
న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి): భారత గణతంత్ర వేడుకలు ఈసారి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా వస్తున్నారు. కానీ.. ఈ వేడుకలకు గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. అయితే.. తనకు ఈ సంబరాలకు రావాలని ఉందని ఆయన అంటున్నారు. తనను ఎందుకు పిలవలేదో తెలియదని, అయినా తాను వెళ్లాలనే అనుకుంటున్నానని చెప్పారు. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే మాజీ ముఖ్యమంత్రులను రిపబ్లిక్ డే ఉత్సవాలకు పిలవరని బీజేపీ అంటోంది. ఆయన మరీ కావాలనుకుంటే మాత్రం ప్రత్యేకంగా పిలవొచ్చని తెలుస్తోంది. ఒబామా వస్తున్న సందర్భంగా రిపబ్లిక్ డే పెరేడ్ జరిగే ప్రాంతంతో పాటు ఢిల్లీ నగరం మొత్తం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ఆహ్వానితుల సంఖ్యను కూడా పరిమితం చేస్తున్నారు. ఏదేమైనా దిల్లీ గడ్డమీద జరుగుతున్న ఉత్సవాలకు తాజా మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం వివాదాస్పదమవుతోంది. దీని ప్రభావం ఎన్నికల్లో కూడా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.