సామూహిక అంత్యక్రియలకు వర్షాలే అడ్డంకి

కష్టంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
డెహ్రాడూన్‌, జూన్‌ 26 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రకృతి కరుణించ లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. వరుసగా మూడో రోజూ సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. బుధవారం కూడా ప్రతికూల వాతావరణం వల్ల సైన్యం, నావికాదళం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. వరదల నుంచి ప్రాణాలతో బయటపడి, పలుచోట్ల చిక్కుకున్న యాత్రికులు బిక్కుబిక్కుమంటున్నారు. ఒకవైపు ఎడతెరిపిలేని వర్షాలు, మరోవైపు సహాయక చర్యలు నిలిచిపోవడంతో దీనస్థితిలో గడుపుతున్నారు. మరోవైపు ప్రబలుతున్న అంటువ్యాధులతో పెను ప్రమాదం పొంచి ఉంది. ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణంలో సైన్యం చేపట్టిన సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. సహాయం కోసం ఇంకా ఎనిమిది వేల మంది యాత్రికులు ఎదురు చూస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 822 మంది యాత్రికులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇప్పటివరకూ 142 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెనలు నేలమట్టమయ్యాయి. మనాలి`గుప్తకాశీ మార్గంలో బుధవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గురువారం మధ్యాహ్నం వరకు గుప్తకాశీ వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. మరోవైపు కేదార్‌నాథ్‌ను మబ్బులు పూర్తిగా కమ్మేశాయి. ఎటుచూసినా మంచు కమ్ముకుంది.
సామూహిక అంత్యక్రియలకు అంతరాయం
వరదల్లో చిక్కుకొని పెద్ద సంఖ్యలో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంతరాయం కలిగింది. మృతదేహాలు బాగా ఉబ్బిపోవడం, అవయవాలు ఛిద్రం కావడంతో మృతుల గుర్తింపు కష్టంగా మారింది. దీంతో ఆయా మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారుల ప్రయత్నాలకు విఘాతం ఏర్పడిరది. ప్రతికూల వాతావరణం కారనంగా వరదల్లో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు. కాగా, అంత్యక్రియలకు ముందు మృతులకు సంబంధించి డీఎన్‌ఏను సేకరించి భద్రపరుస్తున్నారు. మృతులపై ఉన్న వస్తువులను, ఆధారాలను ప్రత్యేకంగా నిల్వచేస్తున్నారు. అలాగే, మృతదేహాల ఫొటోలు తీసి అందుబాటులో ఉంచనున్నారు.
ప్రబలుతోన్న అంటువ్యాధులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో సామూహిక అంత్యక్రియలకు ఆలస్యమవుతోంది. దీంతో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే, కలరా వ్యాధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చాలా మంది స్థానికులు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. వాంతులు, వీరేచనలతో బాధ పడుతున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో 128 మంది చికిత్స పొందుతున్నారు. మృతదేహాలు కుళ్లిపోవడం, వాటికి అంత్యక్రియలు నిర్వహించక పోవడంలో వ్యాధి ప్రబలుతోన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రధానంగా కేదార్‌నాథ్‌ పరిసరాల్లో ఎక్కువమంది అస్వస్థతకు గురవుతున్నారు. వారికి వైద్య సాయమందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. మరోవైపు, ఢల్లీి నుంచి మూడు ప్రత్యేక వైద్య బృందాలు ఉత్తరాఖండ్‌కు చేరుకున్నాయి.ఇదిలా ఉంటే, వరదల్లో చిక్కుకొని ఇప్పటివరకు 560 మంది మృతి చెందారని డెహ్రాడూన్‌ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. 344 మంది గల్లంతయ్యారని, 436 గాయపడ్డారని తెలిపింది. జల ప్రళయం మూలంగా తలెత్తిన నష్టం వివరాలను విపత్తు నిర్వహణ శాఖ బుధవారం వెల్లడిరచింది. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 99 వేల మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఇంకా పలుచోట్ల నాలుగు వేల మంది చిక్కుకున్నారని ప్రకటించింది. వరదల వల్ల 154 వంతెనలు, 2,232 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 1520కి పైగా రహదారులు దెబ్బ తిన్నాయని గుర్తించినట్లు తెలిపింది.