సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఫలితమేనా?

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లహోర్‌లోని కోట్‌లఖ్‌పత్‌ జైలులో రెండు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌ను తోటి ఖైదీలు అత్యంత పాశవికంగా దాడి చేసి గాయపరిచారు. వారి దాడిలో తీవ్ర గాయాలపాలైన సరబ్‌జిత్‌సింగ్‌ అక్కడే జిన్నా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. సరబ్‌జిత్‌ విషాదాంతం వెనుక ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సరబ్‌జిత్‌ స్వదేశంపై విపరీతంగా అభిమానం చూపేవాడని, భారత్‌ను ఎవరైనా కించపరిస్తే తిరగబడి గర్జించేవాడని కోట్‌లఖ్‌పత్‌ జైలు అధికారులు, సహచర ఖైదీలు పేర్కొన్నారు. ఈక్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన ఖైదీలు సరబ్‌పై ద్వేషం పెంచుకొని కుట్ర పన్ని చంపారని కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారులు చెప్తున్నారు. అందులో నిజమెంత ఉందో తెలుసుకోవడం కష్టమే. ఎందుకంటే ఘటన జరిగింది లాహోర్‌లో.. విచారణాధికారులు అక్కడి పోలీసులే. ఈ పరిస్థితుల్లో సరబ్‌జిత్‌ మరణంపై నిజానిజాలు వెలుగులోకి వస్తాయా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఆయనకు శవపరీక్ష నిర్వహించిన జిన్నా ఆస్పత్రి వైద్యుల నివేదికకు, అమృత్‌సర్‌ వైద్య కళాశాల వైద్య బృందం నివేదికలోనూ అనేక వైరుధ్యాలున్నాయనే కథనాలు వెల్లువెత్తున్నాయి. సరబ్‌జిత్‌ పొట్టలో కొన్ని అవయవాలు మాయమయ్యాయని, తల, ఛాతి, నడుము భాగంలో తీవ్రమైన గాయాలున్నట్లు పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు పేర్కొన్నారు. సరబ్‌జిత్‌పై జరిగిన పాశవిక దాడిని యావత్‌ భారత్‌పై దాడిగా భావిస్తున్నారు. ఈ దాడికి, పాకిస్థాన్‌ ప్రభుత్వానికి సంబంధం లేదనే వాదనలూ లేకపోలేదు. కానీ ఆ దేశ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు భారతీయ ఖైదీలు ఐదు నెలల వ్యవధిలో హత్యకు గురికావడం ఆందోళన కలిగించే అంశం. పాక్‌ జైళ్లలో భద్రతలోని డొల్లతనాన్ని కూడా ఈ హత్యలు ఎత్తిచూపుతున్నాయి. సరబ్‌జిత్‌  1990 జూన్‌లో మద్యం మత్తులో పాకిస్థాన్‌ సరిహద్దు దాటి ఆ దేశంలోకి ప్రవేశించి జైలు పాలయ్యాడని అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పంజాబ్‌లోని తరన్‌ తరన్‌ జిల్లాలో గల బిఖివిండ్‌ భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే సరబ్‌జిత్‌ 1989లో లాహోర్‌, ముల్తాన్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సూత్రధారి అంటూ పాకిస్థాన్‌ సైన్యం అభియోగాలు మోపింది. దీనిపై న్యాయస్థానాల్లో విచారణ జరిగిన తర్వాత సరబ్‌జిత్‌కు మరణశిక్ష విధించారు. తర్వాత ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అతడి విడుదల కోసం కుటుంబ సభ్యులు రెండు దశాబ్దాలుగా జరిపిన పోరాటం ఫలితాన్నివ్వలేదు. మద్యం మత్తులో సరిహద్దు దాటినట్లుగా చెప్పుకున్న సరబ్‌జిత్‌ సింగ్‌ విగతజీవిగా మారాకే స్వదేశానికి ఆయన మృతదేహం చేరుకుంది. అయితే ఇక్కడ పాలకులు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రతినిత్యం పరస్పర సైన్యాల కవ్వింపులతో ఉద్రిక్తంగానే ఉంటుంది. దీన్ని ఇరు దేశాల పాలకులు, సైనికాధిపతులు ఖండించవచ్చుగాని నిజం కాకపోదు. అసలు కవ్వింపు చర్యలే లేకుంటే ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు వెలువడవు. భారత సరిహద్దు దాటి పాక్‌ భూభాగంలోకి సరబ్‌జిత్‌ మత్తులో ప్రవేశించిననాడు భారత ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. అతడు తమకు చెంది వ్యక్తే కానట్లు చెప్పుకుంది. అలాగే అనేక సందర్భాల్లో పాక్‌కు చెందిన చొరబాటుదారులు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన అనేక ధ్వంస రచనలకు పూనుకున్నప్పుడు పాకిస్థాన్‌ ప్రభుత్వమూ వారు తమ దేశస్తులే కాదని చెప్తుంది. ముంబయిలో నరమేధం సృష్టించి సజీవంగా చిక్కిన అజ్మల్‌ కసబ్‌ తమ దేశస్తుడే కాదంటూ పాకిస్థాన్‌ బుకాయించింది. అలగే ఎంతోమంది ఉగ్రవాదులకు తమ దేశానికి సంబంధం లేదని చెప్పింది. ఇరు దేశాల్లో విధ్వంసర ఘటనలు జరిగినప్పుడు ఇరు పక్షాల స్పందన ఒకేలా ఉంటుంది. ఆ దేశంలో చోటు చేసుకున్న అంతర్గత కలహాల వల్ల ఆ దుర్ఘటన చోటు చేసుకుందని. అంతర్గత కలహాలు, సీమాంతర ఉగ్రవాదం రెండింటినీ ఒకే ఘాటన కట్టడం ఇరు దేశాలకు పరిపాటిగానే మారింది. ఉగ్రవాద చర్యల వల్ల ఎక్కువగా నష్టపోయింది భారతీయులే. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. పాకిస్థాన్‌లో ప్రధానులు, మాజీ ప్రధానులు హత్యకు గురై, పలు పర్యాయాలు సైనిక పాలన కూడా వచ్చింది. అక్కడ కల్లోల పరిస్థితులను వివరించేందుకు ఈ ఘటనలు చాలు. కానీ ఇరు దేశాల పాలకుల్లో గూడుకట్టుపోయిన సామ్రాజ్య విస్తరణ కాంక్షే ఈ నరమేధానికి కారణమవుతోంది. కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో గెలిచేందుకు ఇలాంటి ఘటనకు ఇరు దేశాల్లో రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతున్నాయి. కొన్ని నెలల క్రితం పాకిస్థాన్‌ జైల్లో నుంచి ఆ దేశాధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ క్షమాభిక్ష పెట్టడం ద్వారా విడుదలైన సుర్జీత్‌సింగ్‌(80) ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. తాను పాకిస్థాన్‌లో కళ్లోలం సృష్టించేందుకే సరిహద్దు దాటానని పేర్కొన్నాడు. భారత్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న పలువురు పాక్‌ ఖైదీలు ఇదే మాట చెప్పారు. ఇరు దేశాల పాలకుల్లో ఉన్న సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష, సమస్యను సజీవంగా ఉంచి ఎన్నికల్లో లబ్ధిపొందాలనే తత్వం ఉన్నంత కాలం ఇలాంటి ఘటనలు చూడక తప్పదు.