సాలూరులో ఉద్రిక్తత
ఆందోళనకు దిగిన పారిశుద్య కార్మికులు
విజయనగరం,జూలై2(జనం సాక్షి): సాలూరు పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గత 29 రోజులుగా చేస్తున్న సమ్మె సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 8గంటలకు చెత్త తరలించే వాహనాన్ని కాంట్రాక్టు ఉద్యోగులు తీయడానికి ప్రయత్నించగా కార్మికులంతా అడ్డుకొని వాహనం ముందు బైఠాయించారు. తమ పొట్టలు కొట్టొద్దంటూ నినాదాలు చేశారు. సీఐ సయ్యద్ ఇలియాద్ మహమ్మద్ సంఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పురపాలక సంఘ అధికారులు, పాలకవర్గ సభ్యులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయినా కార్మికులు తమ నిరసనను వీడలేదు. తమ పైనుంచి వాహనాలు పోనివ్వాలని వాహనానికి అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ప్రతిఘటించడంతో ఒక్కొక్కరిని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించి పట్టణ స్టేషన్‌కు తరలించారు.