సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు

– ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొననున్న సీఎం
అమరావతి, జులై7(జ‌నం సాక్షి): సింగపూర్‌ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల సింగపూర్‌ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి చెన్నై వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సులో సీఎం పాల్గొననున్నారు. సదస్సులో కొన్ని ముఖ్యమైన సమావేశాలు, బృంద చర్చల్లో పాల్గొనటంతో పాటు… పట్టణ, నగరీకరణకు సంబంధించిన అంశాలపై కీలక ప్రసంగాలు చేయనున్నారు. వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున స్మార్ట్‌ నగరాలను అభివృద్ధి చేస్తున్నందున వీటన్నింటికీ దోహదపడేలా ఈ పర్యటనకు రూపకల్పన చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి.నారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్‌, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సమాచార శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ తదితరులు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై పర్యటనలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఆదివారం మేయర్ల ఫోరంలో ‘నివాసయోగ్య, సుస్థిర నగరాలు-సాంకేతికతతో సమ్మిళత వృద్ధి, రాష్ట్ర, నగరస్థాయి సమన్వయం’ అన్న అంశంపై సీఎం ప్రసంగిస్తారు. ఆదివారం సాయంత్రం వివిధ దేశాల మేయర్లు, ప్రతినిధులతో జరిగే విందులో పాల్గొంటారు. 9న జరిగే ప్లీనరీలో రణిల్‌ విక్రమసింఘేతో కలసి చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్‌ పెవిలియన్‌లో ‘నగరీకరణ- జలవనరులు, పర్యావరణం, రవాణా నిర్వహణ’ అన్న అంశంపై ప్రపంచబ్యాంకు సీఈఓ క్రిస్టాలినా జార్జివా, యూఏఈ పర్యావరణ మంత్రి థాని అల్‌ జియోది, జాకోబ్స్‌ ఛైర్మన్‌ స్టీవెన్‌ డెమెట్రూ, దసాల్ట్స్‌ సిస్టమ్స్‌ వైస్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ చార్లెస్‌లతో కలసి చర్చలో పాల్గొంటారు. సింగపూర్‌ మంత్రులు హెంగ్‌ స్వీ కెయెట్‌, లారెన్స్‌ వోంగ్‌, ఈశ్వరన్‌, డెస్మాండ్‌ లీ టీసెంగ్‌లతో చంద్రబాబు సమావేశమవుతారు. ప్రఖ్యాత లీ క్వాన్‌ యూ ఇనిస్టిట్యూట్‌లో జరిగే ‘లీ క్వాన్‌ యూ’ అవార్డు ప్రదానోత్సవంలో, సింగపూర్‌ అధ్యక్షురాలు హలీమా యాకోబ్‌తో కలసి పాల్గొంటారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై సీఎం చర్చలు జరపనున్నారు.