సింగరేణికి ఆదాయం– ప్రజలకు అనారోగ్యం

* బొగ్గు రవాణా తో బోడు సెంటర్ అంతా దుమ్ము మయం
టేకులపల్లి ,జూన్ 2( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ ద్వారా సింగరేణి కోట్ల రూపాయలు ఆదాయంతో సిరులు పండిస్తూ జాతీయస్థాయిలో కోయగూడెం ఓసి మంచి గుర్తింపు పొందింది. కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్న కోయగూడెం ఓసీ మూలాన మండల ప్రజలకు మాత్రం టిప్పర్ లారీలతో బొగ్గు రవాణా వలన ప్రధాన రహదారి పొడవునా బొగ్గు సూర, కింద దుమ్ము తో బోడు రోడ్డు సెంటర్ అంతా భయంకరంగా దుమ్ము లెగిసి పడటంతో ప్రయాణికులకు, మండల కేంద్రానికి వచ్చేపోయే ప్రజలకు, రోడ్డుకిరువైపులా నివసించే వారికి, దుకాణదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. బొగ్గు రవాణా జరిగే రోడ్డు పొడవునా ప్రధాన కూడలి సెంటర్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోడ్డుకిరువైపులా నీళ్లు చల్లించాల్సి ఉంది. గతంలో ఎన్నోసార్లు ఎగిసిపడుతున్న దుమ్ము గురించి సింగరేణి అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. కంటితుడుపుగా కొద్ది రోజులు నీళ్లు చల్లించి చేతులు దులుపుకోవడం వారికి పరిపాటిగా మారింది. కోయగూడెం ఓసి ద్వారా లాభాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల అనారోగ్యాల మీద చూపకపోవడం పలువురు విమర్శిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు దృష్టిసారించి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్న బొగ్గు రవాణా ద్వారా దుమ్మును అరికట్టడం కోసం సింగరేణి అధికారులతో సంప్రదించి ప్రతిరోజు వాటరింగ్ చేయించాలని మండల కేంద్రం ప్రజలు కోరుతున్నారు.