సింగరేణిలో అధికారుల కొరత?
ఖమ్మం,అక్టోబర్4 (జనంసాక్షి): సింగరేణిలో కార్యనిర్వహణ సంచాలకుల స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. కొత్త గనులు, పర్యావరణ అనుమతులు, బొగ్గు ఉత్పత్తి పర్యవేక్షణకు సంబంధించి ఒక్కో డివిజన్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అధికారులను అప్రమత్తం చేయడంలో రెండు పదవులు కీలకం. ఖాళీ స్థానాలను భర్తీ చేయడంలో యాజమాన్యానికి అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఆర్జీ-1, 2, శ్రీరాంపూర్, మందమర్రి, భూపాలపల్లి ప్రాంతాలను పర్యవేక్షించే అధికారి కరవయ్యారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, ఆర్జీ-3, బెల్లంపల్లి డివిజన్‌లలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై పర్యవేక్షణ లోపించనుంది. రెండు సంచాలకుల స్థానాలు ఖాళీ ఉండటం వల్ల కొత్త గనుల ఏర్పాటుకు సంబంధించి పురోగతి, పర్యవేక్షణ లోపించనుంది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశిరచుకున్న సింగరేణి దాన్ని అధిగమించాలంటే ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే పర్యవేక్షణ ఉండాలి. బాధ్యులైన సంచాలకులు లేకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తనున్నాయి. కింది స్థాయి అధికారులను సమన్వయం చేసే అవకాశం లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు సవిూక్షించే వారు కరవయ్యారు.