సింగరేణిలో ‘ఠాగూర్‌’ సీన్‌..!

గోదావరిఖని, ఆగష్టు 8, (జనం సాక్షి)     సింగరేణిలో ‘ఠాగూర్‌’ సీన్‌ పునరావృతమైంది. బుధవారం జరిగిన గని ప్రమాదంలో దుర్మరణం చెందిన కార్మికునమృతదేహానికి స్థానిక సింగరేణి ప్రధాన ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వైద్యసహాయాన్ని అందించారు. వైద్యులు తెలిసి… వైద్యం చేశారా… లేక యాజమాన్యం హుకుంతో నటించారా… అనే విషయాలు కార్మిక వర్గంలో ప్రశ్నార్థకమయ్యాయి. దీంతో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కార్మికుడు ఆసుపత్రి ఓపి విభాగంలోని అద్దాలను ధ్వంసం చేశారు. డ్యూటీ డాక్టర్‌ గదిలోని వస్తువులను చిందరవందర చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఆర్జీ-1 పరిధిలోని 2ఇంక్లయిన్‌లో మొదటిషిప్ట్‌లో ప్రమాదం జరగగా, ఎరుకల కిష్టయ్య(48) అనే కోల్‌కట్టర్‌ కార్మికుడు మృతిచెందాడు. 4వ సీమ్‌లోని 50వ లెవల్‌ వద్ద బోష్‌ మిషన్‌తో సైడ్‌వాల్‌ చిప్పింగ్‌ను కిష్టయ్య నిర్వహిస్తున్న క్రమంలో పైకప్పు నుంచి బొగ్గు కిష్టయ్యపై కుప్పకూలింది. దీంతో కిష్టయ్య తలకు బలంగా గాయాలయ్యాయి. ఇతన్ని రక్షించే ప్రయత్నంలో కిష్టయ్యతో విధులు నిర్వహిస్తున్న మరో కోల్‌కట్టర్‌ కార్మికుడు చిన్నల మల్లయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే తీవ్రంగా గాయపడ్డ కిష్టయ్యను తోటి కార్మికులు వైద్యం కోసం గనిపైకి తీసుకొస్తున్న క్రమంలో 38వ లెవల్‌ వద్ద మృతిచెందాడు. కాగా, కారణం ఎలా ఉన్నప్పటికి… గని ఉన్నతాధికారులు రవిసుధాకర్‌, శ్రీహరి, జయరాజులు కిష్టయ్య తీవ్రంగా గాయపడ్డాడని… ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని అంబులెన్స్‌లో అధికారులే స్వయంగా ప్రధాన ఆసుపత్రికి చేర్చారు. అయితే కిష్టయ్య మృతదేహానికి డ్యూటీ డాక్టర్‌ రవి, ఇతర వైద్య సిబ్బంది ‘ఠాగూర్‌’ సీన్‌ చూపించారు. మృతదేహానికి గ్లూకోజ్‌ పెట్టడం, ఈసిజి తీయడం, ఎక్స్‌రే తీయడం ఇలాంటి వైద్యపరీక్షలను నిర్వహించారు. ఓ వైపు గని వద్ద కిష్టయ్య మృతిచెందాడని అప్పటికే ప్రకటించగా… ఆసుపత్రిలో వైద్యం చేయడమెలా సాధ్యమవుతుందని… కార్మికులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఓ దశలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ సిఐ ఎ.మహేష్‌, పోలీసు సిబ్బంది హుటాహుటిగా సింగరేణి ఆసుపత్రికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దశలో పోలీసులకు పలువురు కార్మిక నేతలకు మధ్య వాగ్వీవాదం జరిగింది. స్థానిక తిరుమలనగర్‌కు చెందిన మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

పలువురిపై పోలీసు కేసు: కిష్టయ్య మరణాన్ని దాచిపెట్టి… మృతదేహానికి వైద్యం జరిపినట్లు నాటకామాడిన గని అధికారులపై, ఆసుపత్రి వైద్యబృందంపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే.. ఆసుపత్రి ధ్వంసానికి పాల్పడిన హెచ్‌ఎంఎస్‌ నాయకుడు రియాజ్‌అహ్మద్‌, మరికొందరిపై కూడా… కేసు నమోదు చేసినట్లు సిఐ మహేష్‌ తెలిపారు.

మరో రెండు ప్రమాదాలు: ఇదే గనిలో బుధవారం ఉదయం వేర్వేరు గని ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పనిస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఒజ్జ రాములు అనే జనరల్‌ మజ్దూర్‌ కార్మికుడు 30వ లెవల్‌ వద్ద బొగ్గును తీస్తుండగా… జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. అలాగే 34వ లెవల్‌లో జరిగిన ప్రమాదంలో మరో కోల్‌కట్టర్‌ కార్మికులు ఎర్రవెల్లి రాజయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరు కూడా… స్థానిక సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘పెరిగిన ప్రమాదాలు: వై.గట్టయ్య(ఏఐటియుసి) సింగరేణి ప్రమాదాలు పెరిగాయి. ఉత్పత్తిపై చూపిస్తున్న శ్రద్ద యాజమాన్యం రక్షణపై చూపడం లేదు. దీంతో ప్రమాదాలు పెరిగాయి. కిష్టయ్య మృతిపై సమగ్ర విచారణ జరపాలి.

‘కొత్త సంస్కృతి’: – ఎస్‌.నర్సింహారెడ్డి(ఐఎన్‌టియుసి)

సింగరేణిలో కొత్త సంస్కృతికి తెరలేచింది. అధికారులు ప్రమాదానికి గురైన కార్మికుల పట్ల చూపిస్తున్న విధానం సహించరానిది. మృతిచెందిన కిష్టయ్య సంఘటనను దాచిపెట్టడానికి, మృతదేహానికి వైద్యం చేయడం సిగ్గుచేటు.

రక్షణకు సమాధి’: – రాజారెడ్డి(సిఐటియు) సింగరేణిలో  యాజ మాన్యం రక్షణకు సమాధి కట్టింది. ఉత్పత్తి కోసం యాజమాన్యం చూపిస్తున్న ఆసక్తి… కార్మికుల ప్రాణరక్షణకు అవసరమగు పరిస్థితులను కల్పించడం లేదు.

నిర్లక్ష్యంతోనే ప్రమాదం ఇ.నరేష్‌(ఇఫ్టూ) కిష్టయ్య మరణానికి యాజమాన్యమే పూర్తి బాధ్యతా వహించాలి. యాజమాన్యం నిర ్లక్ష్యంతోనే కిష్టయ్య ప్రాణాలు కోల్పోయాడు.

సిగ్గుచేటు: రియాజ్‌అహ్మద్‌(హెచ్‌ఎంఎస్‌) చనిపోయిన కిష్టయ్యకు ట్రీట్‌మెంట్‌ను అధికారులు ఇప్పించడం సిగ్గుచేటు. యాజమాన్యం నాటకాలు ఇంకెంతో కాలం నిలబడవు. కార్మికులు బుద్ది చెబుతారు.