సింధు పైకి… కష్యప్‌ కిందకి…

రెండో ర్యాంక్‌ నిలుపుకున్న సైనా

న్యూఢిల్లీ ,మే 3 (జనంసాక్షి): అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తాజాగా విడుదలైన జాబితాలో తెలుగు తేజం పివి సింధు ర్యాంకింగ్‌ గణనీయంగా మెరుగుపడింది. ఇండియన్‌ ఓపెన్‌లో సెవిూస్‌ వరకూ చేరిన సింధు రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచింది. ఆమె కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌. అలాగే భారత స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వాల్‌ తన రెండో స్థానాన్ని నిలుపుకుంది. సైనా ఇండియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లోనే నిష్కమ్రించినప్పటకీ… ఆమె ర్యాంకింగ్‌లో మార్పు లేదు. అటు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కష్యప్‌ టాప్‌ టెన్‌లో చోటు కోల్పోయాడు. ఇండియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో కష్యప్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో ఐదు స్థానాలు దిగజారి 11వ ర్యాంకులో నిలిచాడు.అయితే పురుషుల సింగిల్స్‌లో ఏడుగురు భారత ఆటగాళ్ళు టాప్‌ 55లో చోటు దక్కించుకోవడం మంచి పరిణామంగా చెప్పొచ్చు. ముంబైకి చెందిన అజయ్‌ జయరాం మూడు స్థానాలు మెరుగై 27వ ర్యాంక్‌ సాధించగా… గురుసాయిదత్‌ ఐదు స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచాడు. ఇటీవల ముగిసిన ఇండియన్‌ ఓపెన్‌లో అజయ్‌ జయరాం క్వార్టర్‌ ఫైనల్‌ వరకూ చేరుకున్నాడు. ఇక మధ్యప్రదేశ్‌ ప్లేయర్‌ సౌరభ్‌ వర్మ ఒక స్థానం మెరుగై 35వ ర్యాంక్‌ సాధించాడు. అలాగే ఇండియన్‌ ఓపెన్‌ సెవిూస్‌ వరకూ చేరిన ఆనంద్‌ పవార్‌ 11 స్థానాలు ఎగబాకి 42వ ర్యాంకులో నిలిచాడు. బి.సాయిప్రణీత్‌ 15 స్థానాలు ముందంజ వేసి 47వ ర్యాంక్‌ సాధించాడు. మిగిలిన వారిలో కె.శ్రీకాంత్‌ 11 స్థానాలు మెరుగై 52వ ర్యాంక్‌ , హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 21 స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ 55 సాధించాడు.