సిఎం కెసిఆర్‌కు పేరు రాకుండా కాంగ్రెస్‌ కుట్ర

ఎన్నికల్లో మరోమారు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు ఏదో ఒక సమస్య లేవనెత్తుతూ అదేపనిగా విమర్శలు చేయడం తగదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్‌ నేతలు తెలంగాణను భ్రష్టుప్టటించారని ఘాటుగా విమర్శించారు. రేవంత్‌ రాకతో బాహుబలి అంటే సంబరపడిపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికలో టిఆర్‌ఎస్‌ సత్తాను మరోసారి చాటుతామని అన్నారు. సర్వేలు, వ్యాపార విధానాలతో సిఎం కెసిఆర్‌కు ప్రజాదరణ రావడంతో తమకు పుట్టగతులు ఉండవనే విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్‌ నానా తంటాలు పడుతోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎర్పడిన అనంతరం పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 3వేల కోట్లతో పనులను పూర్తిచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని యావత్‌దేశం కొనియాడుతుంటే ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రైతుల పేరుతో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌ పాలకులదేనని విమర్శించారు.కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి రెండు లిఫ్టుల ద్వార అచ్చంపేట నియోజకవర్గంలో 15 చెరువులను నింపామని, త్వరలో మరో ఇరవై చెరువులను నింపుతామన్నారు. డిండి ప్రాజెక్టులోకి త్వరలో నీరందించి యాసంగిలో రైతుల పంటలను కాపాడుతామని అన్నారు. గత పాలకుల పుణ్యమా అని శ్రీశైలం నిర్వాసితులకు ఇప్పటికి న్యాయం జరుగలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటికి 250 గురుకుల పాఠశాలలు మంజూరు చేసిందని త్వరలో బీసీలకు మరిన్ని గురుకుల పాఠశాలలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో లేకపోయినప్పటికి మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు.