దేశంలో అగ్రగామిగా తెలంగాణ

సిఎం కెసిఆర్‌ తపనంతా అదే

అందరూ కలసికట్టుగా చేయూతనివ్వాలి

అవినీతికి పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ

డిప్యూటి సిఎం కడియం శ్రీహరి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని సీఎం కేసీఆర్‌ తపనపడుతున్నారని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఢిల్లీలో ఎంపీగా ఉన్న తనను సీఎం కేసీఆర్‌ పిలిచి డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో అత్యాశ మంచిది కాదు. అధికారం ప్రజల కోసం కాకుండా స్వార్ధానికి ఉపయోగిస్తే రాజకీయల్లో ఎక్కువ కాలం నిలువ లేరని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి అజెండాగా పని చేద్దామని పిలుపునిచ్చారు. భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామిని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం దర్శించుకున్నారు. వేదపండితులు పూర్ణకుంభం తో మంత్రులిద్దరికి స్వాగతం పలికారు. అనంతరం సీతారములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నాలుగేళ్ల చిన్నరాష్ట్రమైనా మన సీఎం పథకాలను దేశం యావత్తు పొగుడుతుందన్నారు. కేంద్రమే మన పథకాల వైపు చూస్తోంది.రూ. 40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. 9 గంటలు పగటి పూట కరెంటు ఇస్తామని మేనిఫేస్టోల పెట్టమన్నప్పుడు తాను సందేహం వ్యక్తం చేశాను.. కానీ దాన్ని కేసీఆర్‌ సవాల్‌ గా స్వీకరించి 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. దేశంలో 24 గంటల పాటు అన్ని రంగాలకు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కడియం శ్రీహరి తెలిపారు. అవినీతి, అక్రమాలకు పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అని పేర్కొన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ రాబందుల్లా పీక్కు తిన్నదని చెప్పారు. రైతుబందు పథకాన్ని రాబందు అనడానికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాల విూద నమ్మకాన్ని పోగొట్టింది కాంగ్రెస్‌ పార్టీయే అని మండిపడ్డారు. సమస్యల పట్ల లోతైన అహగాహన కలిగిన ప్రభుత్వం తమదన్నారు. కేసీఆర్‌ లోతైన అధ్యయనం చేస్తారు. వ్యవసాయం పండుగ, రైతును రాజును చేయాలని సీఎం భావిస్తున్నారు అని తెలిపారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలన్నదే సీఎం కేసీఆర్‌ తపన కడియం శ్రీహరి ఉద్ఘాటించారు.